ఒకరిని మించి మరొకరు.. ముదిరిన అమెరికా, చైనా టారీఫ్ వార్..!

విధాత: డ్రాగన్ దేశం చైనాపై అగ్రరాజ్యం టారీఫ్ యుద్ధానికి దిగింది. తామేమి తగ్గేదే లేదంటూ చైనా కూడా సుంకాల టారీఫ్ వార్ లో హీట్ పుట్టిస్తుంది. మరోసారి చైనాపై అమెరికా సుంకాల మోత మోగించింది. చైనా దిగుమతి వస్తువులపై సుంకాలను 145 నుంచి 245 శాతానికి పెంచింది. తమ వస్తువులపై ప్రతీకారంగా చైనా దిగుమతి సుంకాలు పెంచిన నేపథ్యంలో ఈ చర్యకు దిగినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. అటు చైనా కూడా అమెరికాపై ఇప్పటికే 125 శాతం సుంకం విధించింది.
తాజాగా తమపై అమెరికా విధించిన 245శాతం సుంకాల విధింపుపై చైనా ఏ విధంగా స్పందించనుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలతో అమెరికా-చైనా మధ్య టారీఫ్ వార్ మరింత ముదురుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా వరకు దేశాలపై సుంకాలను పెంచారు. కానీ చైనాపై మాత్రం ఆ పెంపు మరీ ఎక్కువగా ఉండటం గమనార్హం. అమెరికా దిగుమతి సుంకాలను పెంచిన నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం చైనా కూడా కీలక నిర్ణయం తీసుకున్నది.
అమెరికా సంస్థ బోయింగ్ ఉత్పత్తి చేస్తున్న విమానాలను ఖరీదు చేయవద్దు అని తమ దేశ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చైనా ఆదేశించింది. బోయింగ్ సంస్థ నుంచి విడిభాగాలు కూడా కొనుగోలు చేయరాదు అని చైనా తమ దేశ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెప్పింది. ఈ ప్రకటన వెలుబడిన మరుసటి రోజే అమెరికా ప్రతీకార చర్యతో సుంకాల పెంపు ప్రకటన చేసింది.