షాకింగ్.. ఇరాక్ ఎంపీల, అధికారుల నివాసాలలో భారీగా అక్రమాస్తులు!

ఇరాక్‌లో అవినీతి వ్యతిరేక భారీ దాడుల్లో ఎంపీలు, ఉన్నతాధికారుల ఇళ్ల నుంచి కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాగ్దాద్ గ్రీన్ జోన్‌లో జరిగిన ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇరాక్ భద్రతా దళాలు బాగ్దాద్ సహా ఇతర నగరాల్లో అవినీతికి వ్యతిరేకంగా ఒక భారీ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించాయి. అనుమానితులుగా గుర్తించిన 47 మందిలో పార్లమెంటు సభ్యులు, ఉన్నతాధికారుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సోదాలలో గుట్టల కొద్ది నోట్ల కట్టలు, కోట్లాది రూపాయల అక్రమాస్తులు, బంగార సహా విలువైన ఆభరణాలు లభ్యమయ్యాయి. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ భారీ యాంటి కరెప్షన్ ఆపరేషన్‌లో భాగంగా, ఇరాకీ ప్రత్యేక దళాలు బాగ్దాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ‘గ్రీన్ జోన్’లోకి ప్రవేశించాయి. ఇక్కడ అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రభావ వంతమైన కుటుంబాలు నివసిస్తుంటాయి.

సోదాలలో పార్లమెంటు సభ్యురాలు హింద్ ఎల్-అబ్బాసీ నివాసంలో 57 మిలియన్ డాలర్ల నగదు, 27 కిలోగ్రాముల స్వచ్ఛమైన బంగారం లభించాయి. అలాగే బంగారంతో చేసిన ఒక జత లోదుస్తులు కూడా దొరికిన ఫోటోలు వారి అవినీతి పరాకాష్టకు నిదర్శనంగా నిలిచాయి. మరో ఎంపీ ఆలియా నాసిఫ్, ఆమె కుమారుడిని అరెస్టు చేయగా..ఆమె నివాసంలో జరిపిన సోదాల్లో భద్రతా దళాలు 20 బిలియన్ల ఇరాకీ దినార్లకు పైగా (సుమారు 15.5 మిలియన్ల అమెరికన్ డాలర్లు) నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇరాకీ అధికారుల సమాచారం ప్రకారం, 13 మంది ప్రస్తుత ఎంపీలతో పాటు సీనియర్ ప్రభుత్వ , చమురు శాఖ అధికారులతో సహా మొత్తం 47 మందిని అరెస్టు చేశారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటంతో ఇరాక్ అధికార యంత్రాంగం నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News