డీఎంకేకు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ
తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు దోషిగా తేల్చింది.

- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంత్రి పొన్ముడిని దోషిగా తేల్చిన మద్రాస్ హైకోర్టు
- 21వ తేదీన శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం
చెన్నై: తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కే పొన్ముడిని కోర్టు మంగళవారం దోషిగా గుర్తించింది. డిసెంబర్ 21వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నట్లు జస్టిస్ జీ జయచంద్రన్ తీర్పు చెప్పారు. గతంలో పొన్ముడి, ఆయన భార్యను ఇదే కేసులో నిర్దోషులుగా విడిచిపెట్టిన ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు పక్కనపెట్టింది. వారిద్దరిని నిర్దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు పొరపాటు చేసిందని పేర్కొన్నది. ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన కేసును సరైన కోణంలో విచారణ కోర్టు విశ్లేషించలేదని తెలిపింది.
ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు తన క్లయింట్ వెళ్లేందుకు వీలుగా శిక్షను రద్దు చేయాలని పొన్ముడి తరఫు న్యాయవాది ఎన్‌ఆర్ ఇలాంగో కోరగా.. ఆ విజ్ఞప్తిని డిసెంబర్ 21న పరిశీలిస్తామని జస్టిస్ జయచంద్రన్ తెలిపారు. 1996-2001 మధ్యకాలంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి 1.79 కోట్ల రూపాయలు పొందారని కేసు దాఖలైంది.
తాజా తీర్పు అధికార డీఎంకేను ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది. కొందరు మంత్రులపై ఇప్పటికే ఈడీ కేసులను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. పొన్ముడిని కోర్టు దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రివర్గం నుంచి తప్పుకోనున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన కేసులో మరో మంత్రి సెంథిల్ బాలాజీ నిదితుడిగా పుళాల్ కేంద్ర కారాగారంలో ఉన్నారు.