త్రయంబకేశ్వరాలయంలో అద్భుతం..అమృతకుండంలో శివలింగం దర్శనం!

మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయ అమృతకుండంలో నీటిని తొలగించగా 65 అడుగుల లోతులో పురాతన శివలింగం దర్శనమిచ్చింది. ఏఎస్ఐ పునరుద్ధరణ పనుల్లో ఈ అరుదైన ఆవిష్కరణ వెలుగుచూసింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 30, 2026, 1:07 pm IST
Read Time: 4 mins
త్రయంబకేశ్వరాలయంలో అద్భుతం..అమృతకుండంలో శివలింగం దర్శనం!

మహారాష్ట్ర నాసిక్ త్రయంబకేశ్వర ఆలయ ప్రాంగణంలోని చారిత్రక ‘అమృత్ కుండ’లో దశాబ్దాల తర్వాత శివలింగం వెలుగు చూసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ, సంరక్షణ పనుల్లో ఈ అద్భుత ఆవిష్కరణ చోటుచేసుకుంది. అమృత్ కుండలోని నీటిని పూర్తిగా తొలగించి శుభ్రం చేయగా.. 65 అడుగుల లోతులో శివలింగం దర్శనమిచ్చింది. పేష్వాల కాలానికి చెందిన అత్యంత పురాతనమైన అమృత్ కుండలోని నీటినే పవిత్ర త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి,ఆలయ పూజలు, అభిషేకాలకు వినియోగిస్తున్నారు.

వాస్తవానికి 2026 సింహస్థ కుంభమేళా సన్నాహాల పనుల సమయంలోనే ఈ అరుదైన శివలింగం ఉనికి వెలుగుచూసింది. తాజాగా పురావస్తుశాఖ ఆలయ పరిరక్షణ చర్యలలో భాగంగా అమృతకుండలోని నీటిని పూర్తిగా తొలగించడంతో శివలింగం స్పష్టంగా దర్శనమిచ్చింది. సాధారణంగా అమృత కుండంలో ఎప్పుడూ నీరు నిండుగా ఉండటం వల్ల, అడుగున ఉన్న శివలింగం కనిపించదు. చాలా సంవత్సరాల తర్వాత నీటిని పూర్తిగా తోడివేయడంతో ఇది స్పష్టంగా దర్శనమిచ్చింది. శివలింగం బయటపడిన సమాచారంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా, సామాన్య భక్తులను అమృతకుండంలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. మహారాష్ట్రలోని నాసిక్‌కు 28 కి.మీ దూరంలో బ్రహ్మగిరి కొండల పాదాల వద్ద ఉన్న త్రయంబకేశ్వరాలయం ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. ఇక్కడ శివలింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తుల రూపంలో కొలువై ఉండటం, పవిత్ర గోదావరి నది జన్మస్థానం కావడంతో త్రయంబకేశ్వరాలయానికి విశిష్టతగా నిలిచింది.