Site icon vidhaatha

Microsoft outage | మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఓఎస్‌లో సాంకేతిక సమస్య.. ప్రపంచవ్యాప్తంగా పలుసేవలకు అంతరాయం.. విమానాలపై భారీగా ప్రభావం

Microsoft outage | మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో గురువారం సాంకేతిక సమస్య తలెత్తింది. విడోస్‌ 10, 11 ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ డెస్క్‌, లాప్‌టాప్‌లో డెస్క్‌టాప్‌ యూజర్లకు బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ దర్శనమిచ్చింది. సిస్టమ్‌ షట్‌డౌన్‌, రీస్టార్ట్ చేయాలంటూ మెసేజ్‌ కనిపించింది. ఈ సమస్య భారత్‌ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ సమస్య ఎదురైంది. దీంతో బ్యాంకులు, విమానాలు, స్టాక్‌ మార్కెట్లు నిలిచిపోయాయి. ముఖ్యంగా విమాన సర్వీసులకు భారీగా అంతరాయం కలుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల విమాన సేవలు స్తంభించాయి. అమెరికాలో ఫ్రంటీయర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక భారత్‌లో ఇండిగో, స్పైస్‌జెట్‌, ఎయిరిండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌ సేవలకు అంతరాయం కలిగింది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో అంతరాయం కారణంగా బుకింగ్‌, చెక్‌-ఇన్‌ సేవల్లో అంతరాయం అంతరాయం ఏర్పడుతున్నట్లుగా విమానయాన కంపెనీలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియాలో వార్తాసంస్థల ప్రసారాల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి. బ్రిటిష్‌ న్యూస్‌ ఛానెల్‌ స్కైన్యూస్‌ సైతం వార్తలను ఎయిర్‌ చేయడంలో అవాంతరాలు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్‌ అనే సూపర్‌మార్కెట్‌ సేవల్లోనూ అంతరాయం కలిగింది. పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌లో కస్టమర్ల బ్యాంకు కార్డులు కూడా పని చేయడం లేదు.

పలు దేశాల్లో ఆన్‌లైన్‌తో అనుసంధానమై ఉన్న పోలీసుల వ్యవస్థలు సైతం స్తంభించాయి. లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడింగ్‌ నిలిచింది. అలాగే, మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్‌ అడ్మినిష్ట్రేషన్‌ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అమెరికాలో 911 అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్‌లో ఎదురైనా సాంకేతిక సమస్యపై కంపెనీ స్పందించింది. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్‌తో పాటు సర్వీసుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌ సాంకేతిక సమస్య ప్రభావం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోనూ కనిపించింది. ఎయిర్ పోర్టులో పలు విమానాలను రద్దు చేశారు.

ఇప్పటివరకు 35 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే బోర్డులు పని చేయడం లేదు. దీంతో మాన్యువల్ బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఏయే విమానాలు రద్దు అయ్యాయో వాటికి సంబంధించిన వివరాలను బోర్డులపై రాస్తున్నారు. అదే సమయంలో బోర్డింగ్ పాసులను పైతం చేతితో రాసి ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ కారణంగా బోర్డింగ్ పాసులపై ఈ ప్రభావం పడిందని.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బోర్డింగ్ పాసులను చేతితో రాసి ఇస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికార వర్గాలు తెలిపాయి. అంతరాయం నేపథ్యంలో ప్రయాణికులు వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని చెక్ ఇన్ చేసుకోవాలని సూచించింది.

Exit mobile version