Spain Job | స్పెయిన్‌లో మంచి జాబ్.. ఫ్రీగా ఇల్లు.. బంపరాఫర్ పొందాలంటే ఆ ఒక్కటే కండీషన్!

Spain Job |ఎవరైనా కష్టపడేది ఉండేందుకు ఇల్లు.. చేసుకునేందుకు మంచి జాబ్.. ఆ రెండింటినే ఫ్రీగా ఇస్తామంటే..! యూరప్ దేశమైన స్పెయిన్‌లోని ఓ చిన్న గ్రామం ఇప్పుడు ఈ బంపరాఫర్‌ను ప్రకటించింది.

Spain Job |ఎవరైనా కష్టపడేది ఉండేందుకు ఇల్లు.. చేసుకునేందుకు మంచి జాబ్.. ఆ రెండింటినే ఫ్రీగా ఇస్తామంటే..! యూరప్ దేశమైన స్పెయిన్‌లోని ఓ చిన్న గ్రామం ఇప్పుడు ఈ బంపరాఫర్‌ను ప్రకటించింది. తమ గ్రామానికి వస్తే ఉద్యోగం ఇవ్వడమే కాకుండా మంచి ఇంటి(Free Home)ని కూడా ఇచ్చేస్తామని చెబుతోంది. మరి అరెనిల్లాస్ ఈ ఆఫర్ ఎందుకు ప్రకటించింది? ఈ ఆఫర్ వెనుక ఉన్న కండీషన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర స్పెయిన్‌లోని సోరియా ప్రావిన్స్‌లోని అరెనిల్లాస్ గ్రామం ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆర్థికంగా ఆ గ్రామం బాగానే ఉన్నప్పటికీ జనాభానే లేదు. ఆ ఊళ్లో కేవలం 45 మంది మాత్రమే నివసిస్తున్నారు. యువత నగరాలకు వెళ్లిపోవడం.. అక్కడే ఉన్న వాళ్లు వృద్ధులు కావడంతో నెమ్మది నెమ్మదిగా ఊరు కాళీ అయిపోతుంది. దీంతో ఇది Empty Spain గా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు.. ఖాళీ అవుతున్న గ్రామాలు మళ్లీ కళకళలాడేలా చేసేందుకు అరెనిల్లాస్ వినూత్న నిర్ణయం తీసుకుంది.

బంపరాఫర్

ఆ గ్రామం మళ్లీ కళకళలాడాలంటే, పిల్లల ఆటపాటలు, కేరింతల ధ్వనులతో నిండిపోవాలంటే ముందు జనాలు రావాలి.. అక్కడ కుటుంబాలు స్థిర నివాసం ఏర్పాటుచేసుకోవాలి. కానీ ఉన్న వాళ్లే ఖాళీ చేసి వెళ్లిపోతుంటే కొత్త వాళ్లు ఎందుకు వస్తారు? అలా రావాలంటే వారికి ఏదైనా బలమైన కారణం ఉండాలి. అందుకే తమ గ్రామానికి వచ్చేవాళ్లకు చేసుకునేందుకు ఉద్యోగం, ఉండేందుకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. మన దగ్గర ఉన్నదంతా వారికి ఇచ్చేస్తే.. వాళ్లే మన ఊరిని కాపాడుకుంటారు.. అనే ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇక ఈ గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తుండటంతో వర్క్ ఫ్రమ్ చేసే వారికి ఇది చాలా అనుకూలంగా మారుతోంది.

షరతులు వర్తిస్తాయి!

ఈ ఆఫర్‌ను ఎవరికి పడితే వారికి ఇవ్వరు. దానికి కొన్ని కండీషన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఒంటరి వారికి ఈ ఆఫర్ ఇవ్వరు. పూర్తిగా ఫ్యామిలీ వస్తేనే ఇస్తారు. పైగా స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆ ఊళ్లో ఎక్కువమంది పిల్లలు లేక ఉన్న స్కూల్‌ను మూసివేశారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పిల్లలను 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలోని పాఠశాలకు పంపిస్తున్నారు. దీనికోసం అక్కడి గ్రామ పంచాయతీనే ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తుంది. అయితే ఎక్కువ మంది పిల్లలు వస్తే గ్రామంలోనే విద్యావ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు. గ్రామానికి వచ్చిన వాళ్లు ఏడాది పొడవునా గ్రామంలోనే ఉండాలి. అక్కడి ప్రజలతో కలిసి పోవాలి. బిల్డింగ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. నిర్మాణ పనులు, పాత భవనాల సంరక్షణ, గ్రామ అభివృద్ధి పనులు చూసుకోవాలి.

మరో ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామంలోని బార్‌ను కూడా నిర్వహించాలి. నగరాల్లో బార్ అంటే వినోదం కోసం వెళ్తారు. కానీ స్పానిష్ గ్రామాల్లో బార్ అంటే ఒక సామాజిక కేంద్రం. అక్కడే చర్చలు, వినోదాలు, పండుగల ప్లాన్‌లు అన్ని జరుగుతుంటాయి. కాబట్టి అరెనిల్లాస్ గ్రామానికి వచ్చే ప్రజలకు ఈ బార్‌ను నిర్వహించే అవకాశం కూడా ఇస్తారు.

ఇవి మనమే చూసుకోవాలి

గ్రామాల్లోని కౌన్సిల్‌, పంచాయతీలకు వీసాలు, ఉద్యోగ పర్మిట్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి యూరప్ బయట దేశాల నుంచి వచ్చే కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలంటే.. స్పెయిన్‌లో ఉండేందుకు చెల్లుబాటు అయ్యే నివాస, పని అనుమతి పత్రాలు కచ్చితంగా ఉండాలి. వాటిని ఆయా కుటుంబాలే అరెంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వీటికి అడ్జస్ట్ అయితే ఓకే!

ఉద్యోగం ఇచ్చి, ఉండేందుకు ఇల్లు కూడా ఇస్తామంటే వచ్చిన అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా! ఈ ఆఫర్‌ను ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు 100కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ వెనుక కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవేంటంటే.. ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉంది. కేవలం 45 మంది మాత్రమే ఉండటంతో నిశ్శబ్దంగా అనిపిస్తుంది. దీంతో ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పైగా మారుమూల గ్రామం కావడంతో సూపర్‌ మార్కెట్, ఆస్పత్రులు, మాల్స్, థియేటర్లు దగ్గరలో ఉండవు. వాటికోసం సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక శీతాకాలంలో చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. వీటన్నింటికీ అడ్జస్ట్ అవుతామంటే మాత్రం.. ప్రకృతి మధ్య ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.!

Latest News