ఎక్కడైనా నొప్పిగా ఉంటే పాటలు వినేయండి.. శాస్త్రవేత్తల సూచన

చిన్న పిల్లలకు దెబ్బ తగిలినపుడు ఏడుస్తుంటే అమ్మ పాట పాడి ఊరుకోబెట్టడం మనకు తెలిసిందే. సంగీతం మానసిక శారీరక బాధలను కూడా మరచిపోయేలా చేస్తుందన్నది భారతీయుల నమ్మకం. ఇదే విషయాన్ని ఆధునిక సైన్స్ కూడా అంగీకరించింది. తాజా పరిశోధనలో మనకు ఇష్టమైన పాటలు మంచి పెయిన్ కిల్లర్స్‌లా పనిచేస్తాయని వెల్లడైంది. ఈ పరిశోధన (Study) వివరాలను జర్నల్ ఫ్రాంటియర్స్‌లో ప్రచురించారు.
అందులోనూ మనల్ని కదలించే పాటలు, ఇష్టపడే పాటలు అయితే ఇంకా ఎక్కువ సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. పాటలు వినడం వల్ల మనిషిలో కలిగే భావోద్వేగాలు వైద్యపరంగానూ విలువైనవని అభిప్రాయపడ్డారు. మనకు కలిగే నొప్పిని 10 పాయింట్ల స్కేలుగా అనుకుంటే.. మనకు నచ్చిన పాట విన్నపుడు అందులో ఒక పాయింట్ నొప్పి మనకు దూరమవుతుంది.
ఇది అడ్విల్ లాంటి పెయిన్‌కిల్లర్ (Songs as Pain killers) చేసే పని కంటే ఎక్కువే. మనిషి నొప్పిపై చేసిన అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 63 మంది ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లను తీసుకున్నారు. వీరి ఎడమ చేతిపై నొప్పి కలిగించడానికి ఒక పరికరాన్ని ఉంచారు. ఇది వేడిగా ఉన్న కాఫీ కప్పుని పట్టుకుంటే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పిని వాలంటీరుకు కలిగిస్తుంది. అనంతరం వారికి ఇష్టమైన రెండు ఇష్టమైన పాటలను, పరిశోధకులు ఎంపిక చేసిన సంగీతాన్ని వినిపించి రెండు సార్లూ వివరాలను నమోదు చేసుకున్నారు.
పరిశోధకులు ఎంపిక చేసిన విషాదకరమైన, సైలెంట్ మ్యూజిక్ వింటున్నపుడు వాలంటీర్లు అందరూ అసౌకర్యానికి గురైనట్లు గుర్తించారు. అంతే కాకుండా వారి నొప్పి కూడా పెరిగిపోయినట్లు భావించారు. అదేవారికి నచ్చిన పాటలను వింటున్నపుడు మాత్రం నొప్పిని మరచిపోయి.. ఆనందం పారవశ్యంలో మునిగిపోయినట్లు గమనించారు. అయితే ఇది ఒక మానసికమైన భావనేనా? లేక నిజంగానే పాటలు ప్రభావం చూపిస్తాయా అనేది లోతుగా గమనించాల్సి ఉందని పరిశోధనా పత్రం వెల్లడించింది.