US ready to attack on Iran | ఇరాన్‌పై దాడికి అమెరికా సన్నద్ధం? భారీ వైమానిక, నావికా బలగాల మోహరింపు
ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధమవుతోందా? F-22, F-35 స్టెల్త్ యుద్ధవిమానాలు, అత్యాధునిక విమాన వాహక నౌకలతో మధ్యప్రాచ్యంలో భారీ సైనిక మోహరింపు జరుగుతోంది. ట్రంప్ తుది నిర్ణయం ఏమిటి? యుద్ధమా? ఇరాన్‌పై ఒత్తిడి పెంచే వ్యూహమా అనేది రెండు మూడు రోజులలో తేలనుంది.
US Deploys F-22, F-35 Jets Near Iran: Biggest Military Buildup Since 2003
ఇరాన్‌పై అమెరికా భారీ సైనిక సమీకరణ
F-22, F-35 స్టెల్త్ యుద్ధవిమానాలు, విమాన వాహక నౌకలతో మధ్యప్రాచ్యంలో అమెరికా శక్తి ప్రదర్శన. ట్రంప్ తుది నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే. యుద్ధమా? లేక ఒప్పందమా? ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
విధాత ప్రపంచం డెస్క్ | హైదరాబాద్:
US ready to attack on Iran | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధమైందా? అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధునాతన స్టెల్త్ యుద్ధవిమానాలు, విమాన వాహక నౌకలు, క్షిపణి నిరోధక నౌకలు, గగనతల పర్యవేక్షణ విమానాలతో అమెరికా భారీ స్థాయిలో సైనిక మోహరింపు చేపట్టినట్టు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
మధ్యప్రాచ్యంలో అమెరికా వైమానిక బలగాల సమీకరణ

ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, అమెరికా వాయుసేన అత్యాధునిక యుద్ధవిమానాలను జోర్డాన్, సౌదీ అరేబియాలోని స్థావరాలకు తరలించింది. వీటిలో F-22 Raptor, F-35 Lightning II వంటి స్టెల్త్ యుద్ధవిమానాలు ఉన్నాయి. అదేవిధంగా F-15 Eagle, F-16 Fighting Falcon లను కూడా మోహరించారు.
గగనతల పర్యవేక్షణ కోసం E-3 Sentry, కమ్యూనికేషన్ నెట్వర్క్ కోసం E-11 Battlefield Airborne Communications Node, ఆకాశం మధ్యలో ఇంధన నింపే KC-135 Stratotanker విమానాలు కూడా మోహరింపులో భాగమయ్యాయి.
ఇవి సాధారణమైన తరలింపులు కావు. దీర్ఘకాలిక యుద్ధానికి అవసరమైన పూర్తి వ్యవస్థ సిద్ధమైందనే సంకేతాలు ఇవి.
అత్యాధునిక విమాన వాహక నౌకలతో సముద్రంలోనూ..

అమెరికా నౌకాదళం కూడా వెనుకంజ వేయలేదు. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ (USS Abraham Lincoln) ఇప్పటికే ప్రాంతంలో ఉంది. అమెరికా ఫ్లాగ్షిప్ విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరార్డ్ ఫోర్డ్(USS Gerald R. Ford) కూడా అబ్రహం లింకన్‌కు తోడుగా మధ్యప్రాచ్యానికి బయలుదేరింది.
బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం గల విధ్వంసక నౌకలు కూడా వెంట ఉన్నాయి. 1991 గల్ఫ్ యుద్ధం, 2003 ఇరాక్ దాడుల తర్వాత ఈ స్థాయిలో నావిక, వాయు సేనల మోహరింపు ఇదే మొదటిసారి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అయితే అప్పటిలా వేలాది విమానాలు కాకపోయినా, ఇప్పుడు ఉన్న సాంకేతిక సామర్థ్యం మరింత అధికమని రక్షణ నిపుణులు అంటున్నారు. తక్కువ బలగాలతోనూ గరిష్ట నష్టం కలిగించే స్థాయి అమెరికాకు ఉంది.
ఇది దాడి వ్యూహమా? ఒత్తిడి పెంచడానికా?
అయితే, దాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇరాన్ అణు సమృద్ధి కార్యక్రమం, క్షిపణి శక్తిని నిలిపివేయడమే లక్ష్యమా? లేక పాలక వ్యవస్థపై ఒత్తిడి పెంచడమా? అన్నసందేహానికి ఇంకా సమాధానం లేదు.
మరోపక్క, జెనీవాలో అమెరికా–ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కొంత పురోగతి ఉన్నా, ఇంకా ప్రధాన అంశాల్లో విభేదాలు అలాగే ఉన్నాయి. ఈ భారీ సైనిక సమీకరణ చర్చల్లో ఒత్తిడిని పెంచే వ్యూహమా? లేక నిజంగానే దాడి వేపు అడుగులా? అన్నది ప్రపంచానికి ఉత్కంఠ కలిగిస్తోంది.
ఇరాన్ కూడా తన క్షిపణులు, ప్రాంతీయ మిత్ర బలగాలతో ప్రతిస్పందనకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మూసివేత వంటి చర్యలు ప్రపంచవ్యాప్త చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మొత్తానికి, యుద్ధమా? లేక ఒప్పందమా? అన్నది రెండుమూడు రోజుల్లో స్పష్టమయ్యే అంశం. కానీ మధ్యప్రాచ్యం మళ్లీ అంతర్జాతీయ దృష్టిని తనవైపు తిప్పుకుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram