Credit Score | బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా.. లోన్లు పొందాలన్నా క్రెడిట్ స్కోర్ తప్పనిసరి. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటేనే తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. ముఖ్యంగా 800కి పైగా క్రెడిట్ స్కోర్ ఉంటే అతి తక్కువ వడ్డీ రేట్లకే పెద్ద మొత్తంలో లోన్లు పొందవచ్చు. కానీ సిబిల్ స్కోర్ 800కి పైగా స్కోర్ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. మరి దీనికి కారణమేంటి? మరి ఈ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా క్రెడిట్ స్కోర్ రేంజ్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. 800 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారు ఎక్సలెంట్ కేటగిరీ కిందకు వస్తారు. కానీ ఈ కేటగిరీలో కేవలం 10-20 శాతం మధ్యే ఉంటారని అంచనా. 750కి మించి ఉంటే మంచి స్కోర్ కింద లెక్కిస్తారు. అదే 650 కంటే తక్కువగా ఉంటే రిస్క్ జోన్ కింద చూస్తారు. అయితే ఎక్కువ మంది 700-800 మధ్యలో ఉంటారు. వారు ఎంత ప్రయత్నించినా 800 కంటే పైకి స్కోర్‌ను పెంచుకోలేకపోతుంటారు. దీనికి పేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో, క్రెడిట్ హిస్టరీ లెంగ్త్ వంటి అంశాలు కారణం కావచ్చు. వాటిని అధిగమిస్తే 800కి మించి క్రెడిట్ స్కోర్ సాధించవచ్చు.
పేమెంట్లు ఆలస్యం చేయొద్దు
క్రెడిట్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు, ఇతర రుణాలను సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ స్కోర్ లెక్కింపులో పేమెంట్ హిస్టరీ ప్రభావం 30 నుంచి 35 శాతంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి క్రెడిట్ స్కోర్ పెరగాలంటే బిల్లులను ఆన్‌టైమ్‌లో చెల్లించాలి.
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో
క్రెడిట్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో బాగుండాలి. మీ క్రెడిట్ లిమిట్‌లో మీరు ఎంత ఉపయోగించుకున్నారో తెలిపేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో. ఇది ఎక్కువగా ఉంటే క్రెడిట్ స్కోర్ తగ్గిస్తుంది. కాబట్టి ఈ రేషియోను 30 శాతానికి మించకుండా చూసుకోవాలి.
పదే పదే లోన్లకు అప్లై చేయొద్దు
ఒకేసారి ఎక్కువ లోన్లు తీసుకోవద్దు. అలాగే రుణం కోసం పదే పదే ఎంక్వైరీలు చేయకూడదు. రుణాల కోసం ట్రై చేసినప్పుడు మీ క్రెడిట్ యోగ్యతను చెక్ చేయడానికి బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను ఎంక్వైరీ చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువసార్లు రుణాల కోసం ప్రయత్నించడం వల్ల అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక సమస్యల కారణంగా పదే పదే అప్పుల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా క్రెడిట్ సంస్థలు నిర్ధారించుకుంటాయి.
క్రెడిట్ హిస్టరీ
చాలామంది ఉపయోగించడం లేదని.. లిమిట్ తక్కువగా ఉందని పాత కార్డులను క్లోజ్ చేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. క్రెడిట్ స్కోర్ లెక్కింపులో క్రెడిట్ హిస్టరీని కూడా చూస్తారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారు? పేమెంట్లు టైమ్ టు టైమ్ చేస్తున్నారా? లేదా అనేవి విశ్లేషించుకుంటాయి. దీని ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. కానీ మీరు పాత కార్డులను క్లోజ్ చేస్తే.. మీ హిస్టరీ తగ్గిపోతుంది. అది మీ క్రెడిట్ రిపోర్టు మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
మీ క్రెడిట్ రిపోర్టు తరచూ చెక్ చేసుకోవాలి
రుణాలు, ఈఎంఐలు పూర్తిగా చెల్లించినప్పటికీ కొన్నిసార్లు బ్యాంకులు వాటిని క్రెడిట్ సంస్థలకు అప్‌డేట్ చేయవు. దీనివల్ల మీరు సరిగ్గా పేమెంట్లు చేయని కేటగిరీ కిందకు వెళ్లిపోతారు. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. తప్పులు, అనధికార లావాదేవీలు కనిపిస్తే వెంటనే వాటిని సరిచేయించుకోవాలి.
క్రెడిట్ మిక్స్ కూడా అవసరమే!
సాధారణంగా రుణాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ లోన్స్. గృహ, వాహన, బంగారం రుణాలు సెక్యూర్డ్ లోన్స్ కిందకు వస్తాయి. క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ వంటివి అన్‌సెక్యూర్డ్ కిందకు వస్తాయి. ఈ రెండు తరహా రుణాలు ఉన్నప్పుడే స్కోర్ పెరిగేందుకు వీలవుతుంది. క్రెడిట్ స్కోర్ లెక్కించేప్పుడు క్రెడిట్ మిక్స్ ప్రభావం 10 నుంచి 15 శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సెటిల్‌మెంట్‌కు వెళ్లవద్దు
బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి కదా అని చాలామంది క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకుని విచ్చలవిడిగా వాడేస్తుంటారు. ఆదాయానికి మించి ఉపయోగించడం వల్ల రుణాలను తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో సెటిల్‌మెంట్‌కు వెళ్తారు. మొత్తం రుణంలో కొంత మొత్తం చెల్లించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుంటారు. దీనివల్ల తాత్కాలికంగా రుణభారం నుంచి విముక్తి లభిస్తుంది. కానీ మీ క్రెడిట్ స్కోర్‌ను అది తీవ్రంగా దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో రుణాలు రావడం కూడా కష్టమైపోతుంది.
సిబిల్ స్కోర్ మెరుగుపడాలంటే నాలుగు నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇది మీ గత క్రెడిట్ హిస్టరీపై ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న ఆర్థిక అలవాట్లే మీ క్రెడిట్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. కాబట్టి క్రమశిక్షణతో వ్యవహరించి సమయానికి చెల్లింపులు చేయడం, క్రెడిట్ కార్డులను తక్కువగా ఉపయోగించడం ద్వారా స్కోర్‌ను పెంచుకోవడం సాధ్యపడుతుందని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
Read More:
Viral News | అమ్మో.. ఇంత శాడిస్టులా! పక్కింటోళ్లకు దెయ్యాల కథలు వినిపిస్తూ టార్చర్!
