విధాత, హైదరాబాద్ : కొత్త వాళ్ళు పార్టీలోకి వచ్చి కబ్జా చేయాలనుకుంటున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతామని, నిజమైన కార్యకర్తలను కాపాడుకుంటామని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి వేడుకలకు హాజరైన రాజగోపాల్ రెడ్డి నివాళులు అర్పించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీ నాయకులను తీసుకోవడం మంచిదేనని..కానీ మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని వెళ్లగొడతాం అంటే ఊరుకోం అన్నారు. రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమేనని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వాళ్ళ తరుపున రాజగోపాల్ రెడ్డి పోరాడుతాడన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం అని తెలిపారు.
తెలంగాణలో రాజశేఖర్ రెడ్డికి అభిమానులు లక్షలాది మంది ఉన్నారని, వైఎస్సార్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా మని, ఎవరెన్ని కుట్రలు చేసినా మేం వైఎస్ార్ శిష్యులం అని, ఆయనను మరువబోమన్నారు. వైఎస్సార్ ఆశయాల కోసం పాటుపడుతానని తెలిపారు. సభలలో నన్ను సీఎం సీఎం అంటున్నారని, అదే టైం వస్తే బ్రహ్మ దేవుడు కూడా ఆపలేడని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి కోసం నేను కొట్లాడటం లేదని, దానిపై హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం అని, పదవి ఇస్తే పేదల కోసమే పనిచేస్తానన్నారు. నాయకుడు అంటే ఎలా ఉండాలో పేద ప్రజలకు ఏవిధంగా అండగా ఉండాలో స్పూర్తి ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, కార్పొరేట్ హాస్పటల్ లో ఈ రోజు పేదవారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఆది ఆయన పుణ్యమేనని చెప్పుకొచ్చారు.
రైతులకు ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది వైఎస్సార్ అని, పేద ప్రజల కోసం, రైతుల కోసం ఆయన తీసుకొచ్చిన పథకాలు దేశ చరిత్రలో ఏ నాయకుడు తీసుకురాలేదు అన్నారు. ఈ ప్రాంత కరువు, ఫ్లోరైడ్ ను తరలించడానికి ఎస్ఎల్బీసీ, ఉదయసముద్రం ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత ఆయనదేనని గుర్తు చేసుకున్నారు. 10సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇచ్చాం అన్నారు.
