Alleti Maheshwar Reddy: ఓ పెద్ద మంత్రికి, ముఖ్యమంత్రికి వివాదం! సంచలన కామెంట్స్ చేసిన ఏలేటి

విధాత : తెలంగాణ కేబినెట్ కలహాల కేబినెట్ మారిందని..నిన్న జరిగిన కేబినేట్ భేటీలో ఓ పెద్ద మంత్రికి, ముఖ్యమంత్రికి వివాదం తలెత్తిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ భేటీలో ఒక సీనియర్ మంత్రికి ఇంకో మంత్రికి కూడా వాగ్వాదం జరిగిందన్నారు. ఇరిగేషన్ శాఖలో రివైజ్ ఎస్టిమేట్ లు, ఫండ్స్ అలకేషన్ వంటి అంశాల్లో వారి మధ్య వివాదం తలెత్తిందన్నారు.
నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని రూ.1000 కోట్ల అలకేట్ చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తే దానికి ఇరిగేషన్ మంత్రి వ్యతిరేకించారన్నారు. ఎన్నో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయని.. నిధులన్ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తీసుకుపోతే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మంత్రికి వాగ్వాదం జరిగినట్లుగా వార్తలు వెలువడ్డాయన్నారు.
సాగునీటి ప్రాజెక్లుల నిర్వహణ, పర్యవేక్షణకు 450కోట్ల రూపాయాలు కేటాయించి బడ్జెట్ ఇయర్ పూర్తవుతున్నా..ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని..ఇంకోవైపు అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందని ఉత్తమ్ వాదించారని ఏలేటి తెలిపారు. కేబినెట్ లో కలహాలకు కీలకమైన మరో అంశం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టు రివైజ్ ఎస్టిమేట్ చేయడమని ఏలేటి తెలిపారు.
గత కేబినెట్ మీటింగ్ లో ఉదండపూర్ రిజర్వాయర్ ఎస్టిమేషన్ ను రూ.430 కోట్ల నుండి రూ.1150 కోట్లకి పొంగులేటి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయించుకున్నాడని.. ఇందులో 700కోట్ల రివైజ్ చేశారని.. మరి మాకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వాళ్లకు ఎందుకు రివైజ్ ఇవ్వరని మంత్రుల మధ్య పంచాయతీ మొదలైందని ఎలేటి వెల్లడించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నియోజకవర్గాలకే నిధులు అందేవని.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే సాగుతుందన్నారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని..ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏలేటి ఆరోపించారు.