Mutton Piece: వ్యక్తి ప్రాణం తీసిన మటన్ ముక్క!

Mutton Piece: ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకోస్తుందో..ఎప్పుడు ఎలా ప్రాణం పోతుందో తెలియని రోజులివి. అయితే చాల వరకు ప్రాణాపాయాలను మనుషులు తమ నిర్లక్ష్యంతో కొని తెచ్చుకుంటుంటారు. ఓ వ్యక్తి పండుగ విందు భోజనానికి వెళ్లి భోజనం చేస్తూ మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని మరణించిన ఘటన వైరల్ గా మారింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం తండాలో ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ సునీల్ కథనం మేరకు సుద్దులం తండాలో ఇటీవల జగదాంబదేవి, సేవాలాల్ మహరాజ్ విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సం నిర్వహించార. ఈ సందర్భంగా తండావాసులు ఆదివారం తమ తమ ఇళ్లలో విందు భోజనం ఏర్పాటు చేసుకున్నారు. తండాకు చెందిన ఫకీరా అనే వ్యక్తి తన స్నేహితులను భోజనానికి పిలిచాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పస్‌పల్లి తండాకు చెందిన తారాసింగ్(48) మిత్రుడు ఫకినా ఇంటికి విందు భోజనానికి వెళ్లాడు.
అందరూ కలిసి రాత్రి భోజనం చేస్తుండగా.. తారాసింగ్ గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయింది. దీంతో అతడు ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అక్కడున్న వారు సహాయక చర్యలు చేపట్టిన శ్వాస ఆడక కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతలోపునే తారాసింగ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య యమునా బాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం తరలించారు. ఒకవైపు గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సం జరిగిన క్రమంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.