అదానీ క‌ల్యాణ్ యోజ‌న‌! అదానీ అడుగుల‌కు మోదీ మ‌డుగులు!

ఒక‌రికి ఒక‌ర‌న్న‌ట్టు ఇరువురి మైత్రి బంధం వ్యాపార సామ్రాజ్యం నిర్మాణంలో అదే కీల‌కం? అన్ని రంగాల్లో విస్త‌రించేలా మోదీ చేయూత‌! విధాత: అదానీ వ్య‌వ‌హారమే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోత‌లు, క‌రోనా కేసులు, కేంద్ర‌-రాష్ట్ర బ‌డ్జెట్‌ల‌ను మించి అదానీ గ్రూప్ అక్ర‌మాల‌పై అమెరికా ష్టార్ట్ సెల్ల‌ర్ హిండెన్‌బర్గ్‌ నివేదికే పాపుల‌రైంది మ‌రి. ఈ క్ర‌మంలో అదానీ గ్రూప్‌.. మోదీ స‌ర్కారు స్నేహంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంటున్న‌ది. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ […]

అదానీ క‌ల్యాణ్ యోజ‌న‌! అదానీ అడుగుల‌కు మోదీ మ‌డుగులు!
  • ఒక‌రికి ఒక‌ర‌న్న‌ట్టు ఇరువురి మైత్రి బంధం
  • వ్యాపార సామ్రాజ్యం నిర్మాణంలో అదే కీల‌కం?
  • అన్ని రంగాల్లో విస్త‌రించేలా మోదీ చేయూత‌!

విధాత: అదానీ వ్య‌వ‌హారమే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోత‌లు, క‌రోనా కేసులు, కేంద్ర‌-రాష్ట్ర బ‌డ్జెట్‌ల‌ను మించి అదానీ గ్రూప్ అక్ర‌మాల‌పై అమెరికా ష్టార్ట్ సెల్ల‌ర్ హిండెన్‌బర్గ్‌ నివేదికే పాపుల‌రైంది మ‌రి. ఈ క్ర‌మంలో అదానీ గ్రూప్‌.. మోదీ స‌ర్కారు స్నేహంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంటున్న‌ది. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ సంక్షేమాలు, ప‌థ‌కాలు, అభివృద్ధి వెనుక అస‌లు ప్ర‌యోజ‌న‌కారి అదానీ గ్రూపేనని, అంతిమ ల‌క్ష్యం అదానీ అభివృద్ధేనని అంటున్నారు.

అదానీ క‌ల్యాణ్ యోజ‌న‌! అదానీ అడుగుల‌కు మోదీ మ‌డుగులు!

రెండున్న‌ర ద‌శాబ్దాల మైత్రి

గౌత‌మ్ అదానీ (Gautam Adani), న‌రేంద్ర మోదీ (Narendra Modi)ల స్నేహం దాదాపు 25 ఏండ్లుగా కొన‌సాగుతున్న‌ది. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మోదీ అవ‌త‌రించిన ద‌గ్గ‌ర్నుంచి ఈ స్నేహం మ‌రింత పెర‌గ‌గా.. ప్ర‌ధానిగా ఆవిర్భ‌వించిన నాటి నుంచి ఇంకా గ‌ట్టిగా పెన‌వేసుకుపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

Gautam Adani | హిడెన్‌బర్గ్‌ రిపోర్ట్‌.. ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి దిగజారిన అదానీ..!

గుజ‌రాత్‌లో మోదీ స‌ర్కారును నిల‌బెట్టేందుకు అదానీ చాలానే స‌హ‌క‌రించార‌ని, జాతీయ రాజ‌కీయాల్లోనూ మోదీ వెనుక ఓ ఆర్థిక శ‌క్తిగా ఉన్నార‌న్న వార్త‌లు కోకొల్ల‌లు. కేంద్రంలో మోదీ నాయ‌క‌త్వంలో బీజేపీ స‌ర్కారు కొలువుదీర‌డం వెనుకా గౌత‌మ్ అదానీ హ‌స్తం సుస్ప‌ష్ట‌మ‌న్న ఆరోప‌ణలూ పెద్ద ఎత్తునే వినిపిస్తున్నాయి.

ఎన్నో రెట్లు పెరిగిన అదానీ ఆస్తులు

గుజ‌రాత్‌లో మోదీ ప్ర‌భుత్వ హ‌యాంలో అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ (adani enterprises) ఆస్తులు ఏకంగా 5,000 శాతం పెరిగాయి. ఈ స‌మ‌యంలో మ‌రే ఇత‌ర గుజ‌రాతీ వ్యాపారి ఆస్తులు కూడా ఇందులో స‌గం కూడా పెర‌గ‌లేదంటే అర్థం చేసుకోవ‌చ్చు.. త‌న స్నేహితుడు అదానీకి ఓ ముఖ్య‌మంత్రిగా మోదీ ఏ రీతిలో అండ‌గా నిలిచార‌న్న‌ది. దాదాపు అన్ని కీల‌క రంగాల్లోనూ అదానీ కంపెనీల‌కు పెద్ద‌పీట ద‌క్కింది.

బిలియనీర్ నుంచి ట్రిలియ‌నీర్‌

గుజ‌రాత్ రాజకీయాల‌కు మోదీ గుడ్‌బై చెప్పే నాటికే గౌత‌మ్ అదానీ సంప‌ద 2.6 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. మ‌న క‌రెన్సీలో ఇది సుమారు రూ.22,000 కోట్లు. ఇక మోదీ ఢిల్లీకి చేర‌డంతో అదానీ సంప‌ద కూడా ప‌రుగులు పెట్టింది. ఈ క్ర‌మంలోనే మోదీ ప్ర‌ధానిగా ఉన్న తొలి నాలుగేండ్ల‌లోనే గౌత‌మ్ అదానీ ఆస్తులు 11.9 బిలియ‌న్ డాల‌ర్ల (దాదాపు రూ.1 ల‌క్ష కోట్లు)కు ఎగ‌బాకాయి.

అదానీ సంచలన నిర్ణయం.. FPO రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన..!

రెండోసారి కూడా కేంద్రంలో మోదీ చేతికే ప‌గ్గాలు రావ‌డంతో అదానీ గ్రూప్ దూకుడు రాకెట్ వేగాన్నే అందుకున్న‌దంటే ఎంత‌మాత్రం అతిశ‌యోక్తి కాదు. ఈ దెబ్బ‌కు ఫోర్బ్స్‌, బ్లూంబ‌ర్గ్ వంటి శ్రీమంతుల జాబితాల్లో ఏండ్ల త‌ర‌బ‌డి త‌న హ‌వా చూపించిన‌ ముకేశ్ అంబానీ కూడా సైడైపోయారు.

తొలిసారి గౌత‌మ్ అదానీ భార‌త్‌లో అత్యంత ధ‌న‌వంతుడిగా అవ‌త‌రించారు. 160 బిలియ‌న్ డాల‌ర్ల (రూ.13.12 ల‌క్ష‌ల కోట్లు) కుపైగా సంప‌ద‌తో ఆసియా కుబేరుల్లోనూ అగ్ర‌స్థానానికి చేరారు. అయితే హిండెన్ బ‌ర్గ్ నివేదిక‌తో అంతా త‌ల‌కిందులైపోయింది. కేవ‌లం 7 రోజుల్లో రూ.10 ల‌క్ష‌ల కోట్ల (120 బిలియ‌న్ డాల‌ర్లు) సంప‌ద క‌రిగిపోయింది. స్టాక్ మార్కెట్ల‌లో న‌మోదైన 10 అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్న‌ది చూస్తూనే ఉన్నాం.

మోదీ ద‌న్నుతో ఒప్పందాలు

న‌రేంద్ర మోదీ రెండోసారి దేశ ప్ర‌ధాని అయ్యాక అదానీ గ్రూప్ వ్యాపారాల జోరు అంతా ఇంతా కాదు. ర‌క్ష‌ణ‌, లాజిస్టిక్స్, విద్యుత్తు రంగాల్లో ఆయా దేశాల‌తో అదానీ సంస్థ‌లు 15 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ దేశాల్లో మోదీ ప‌ర్య‌టించిన త‌ర్వాత‌నే అదానీకి ఈ డీల్స్ అన్నీ రావ‌డం అనేక అనుమానాలు రేకెత్తించింది.

‘అదానీ’ గ్రూప్ మాయాజాలం.. దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని కుంభకోణం

అత్యంత వివాదాస్ప‌దంగా మారిన ఆస్ట్రేలియా మైనింగ్ ప్రాజెక్టు కూడా ఇలా వ‌చ్చిన‌దేనని చెబుతుంటారు. ఈ ప్రాజెక్టు అదానీ సొంతం చేసుకోవ‌డానికి దేశీయ ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం ఎస్బీఐ 1 బిలియ‌న్ డాల‌ర్ల (రూ.8,200 కోట్లు) రుణాన్ని కూడా మంజూరు చేయ‌డం విశేషం. ఆ త‌ర్వాతే 15.5 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్ట్రేలియా ప్రాజెక్టు అదానీ జేబులోకి వెళ్లింది.

ఎడ‌పెడా రుణాలు

అదానీ వ్యాపార సామ్రాజ్యం పునాదులు మోదీ స‌ర్కారు, బ్యాంకింగ్ రుణాల‌పైనే నిల‌బ‌డ్డాయి. 2015లో అదానీ కంపెనీల అప్పులు రూ.92,000 కోట్లుగా ఉన్నాయి. అప్పుడే దీనిపై అంత‌ర్జాతీయ‌ సంస్థ‌ క్రెడిట్ సూసీ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇప్పుడు గ్రూప్ రుణ భారం రూ.2.31 ల‌క్ష‌ల కోట్ల‌ను దాటింది. అదానీ ప‌వ‌ర్ వాటానే మూడో వంతుగా ఉంటుంద‌ని అంచ‌నా.

ఇక మోదీ అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల్లోనే కార్పొరేట్ల రుణాల‌ను బ్యాంకుల చేత పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌రించారు. ఈ నిర్ణ‌యంతో ఎక్కువ‌గా ల‌బ్ధి పొందిన‌ది అదానీ గ్రూపే. రూ.15,000 కోట్ల అదానీ ప‌వ‌ర్ రుణాలు రీస్ట్ర‌క్చ‌ర్ అయ్యాయి.

నిండా మునుగుతున్నఅదానీ గ్రూప్ మ‌దుప‌రులు

నిజానికి అదానీ ప‌వ‌ర్ రూ.5,000 కోట్ల నిధుల‌ను దారి మ‌ళ్లించింద‌ని 2014-15లో డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తెలిపింది. ప‌న్ను ఎగవేత‌కు స్వ‌ర్గ‌ధామాలైన దేశాల‌కు ఈ సొమ్మును త‌ర‌లించింద‌న్న‌ది. 2017 ఆగ‌స్టు 21న ఈ కేసును డీఆర్ఐ మూసేయ‌గా, ఇది జ‌రిగిన 4 రోజుల త‌ర్వాత కేంద్ర రెవెన్యూ కార్య‌ద‌ర్శి హ‌స్ముఖ్ అధియాతో అదానీ భేటీ అవ‌గా, ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపిన‌ట్టు అప్ప‌ట్లో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి కూడా.

రాందేవ్ బాబాకూ..

మోదీ హ‌యాంలో ఎక్కువ‌గా లాభ‌ప‌డ్డవారిలో యోగా గురువు రాందేవ్ బాబా కూడా ఉన్న‌ట్టు వినిపిస్తున్న‌ది. 2014 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మోదీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన రాజకీయేత‌ర వ్య‌క్తుల్లో బాబా కూడా ఒక‌రు. దీంతో అధికారంలోకి వ‌చ్చాక వ్యాపార‌ప‌రంగా త‌గిన స‌హ‌కారం కేంద్రం నుంచి బాబాకు ద‌క్కింద‌ని చెప్తున్నారు. అందుకే ప‌తంజ‌లి గ్రూప్ దేశమంత‌టా విస్త‌రించగ‌లిగింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. 2014-18 మ‌ధ్య దేశంలోని 20 మంది అత్యంత సంప‌న్నుల్లో 6 బిలియ‌న్ డాల‌ర్ల‌కుపైగా సంప‌ద‌తో పతంజ‌లి యాజ‌మాన్యం కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

FPOను వెన‌క్కి తీసుకోవ‌డానికి కార‌ణం అదే..