Site icon vidhaatha

బాబోయ్‌.. బాబూమోహన్‌ బూతులు.. బండి సంజయ్‌ను కూడా వదల్లే!

విధాత‌: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో కొందరి రూటే సపరేటు! అందులో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బాబూమోహన్‌ కూడా ఒకరు. తాజాగా ఒక కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆయన ఎత్తుకున్న బూతు పురాణం ప్రసారం చేయడానికి చానళ్లు చాలా ‘బీప్‌’లే వేసుకోవాల్సి వచ్చింది.

అందోల్‌ నియోజకవర్గంలో వెంకట రమణ అనే బీజేపీ కార్యకర్తను బాబూ మోహన్‌ బండ బూతులు తిట్టారంటూ ఒక ఆడియో వైరల్‌ అవుతున్నది. మీతో కలిసి పనిచేస్తానంటూ ఫోన్‌ చేసిన కార్యకర్తను పట్టుకుని.. నీ వయసెంత? నువ్వెంత, నీ బతుకెంత? నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? జోగిపేటకు నువ్వు ఏం చేయగలవు? ఏమనుకుంటున్నావు రా? నువ్వు ఎంతరా నాకు, గాడిద, వెధవ, బాడ్కవ్‌ అంటూ చెలరేగిపోయారు.

‘రైటర్‌ పద్మభూషణ్’ సినిమా.. మహిళలకు ఉచితం

ఇంకోసారి నాకు ఫోన్‌ చేస్తే జోగిపేటలో చెప్పు తీసుకుని కొడతానంటూ రాయలేని భాషలో బండ బూతులు తిట్టారు. అంతేకాదు.. కావాలంటే తన సంభాషణను రికార్డు చేసుకో అంటూ ఆఫర్‌ కూడా ఇచ్చారు. బూతులతోపాటు.. తన గొప్పతనాన్ని చాటుకునేందుకు అందులో ఆయన భారీగానే కష్టపడినట్టున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేయడానికి తనను అమిత్‌ ఎంచుకుని మరీ పార్టీలో చేర్చుకున్నారని ఆయన సెలవిచ్చారు. తానొక ప్రపంచ స్థాయి నాయకుడినని తనకు తానే బిరుదు కూడా ఇచ్చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కూడా వదల్లేదు. ‘ఎవడ్రా.. వాడు నా తమ్ముడు’ అని అన్నారు. అవసరమైతే రేపే బీజేపీకి రాజీనామా చేస్తానని ప్రకటన కూడా చేసిపడేశారు. మరి దీనిపై కాషాయ పార్టీ పెద్దలు ఏమంటారో చూడాలి!

Exit mobile version