Back step | బీమా పాలసీల సరెండర్‌ వాల్యూ కొత్త నిబంధనలపై వెనక్కి తగ్గిన IRDAI

Back step | బీమా పాలసీల సరెండర్‌ వాల్యూ కొత్త నిబంధనలపై వెనక్కి తగ్గిన IRDAI

Back step : బీమా పాలసీల సరెండర్‌ వాల్యూకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై ‘బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI)’ వెనక్కి తగ్గింది. సవరించిన సరెండర్‌ వాల్యూస్‌పై బీమా సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో IRDAI ఈ నిర్ణయం తీసుకుంది. సరెండర్‌ వాల్యూ పెంచడంవల్ల పాలసీ హోల్డర్లు మధ్యలోనే నిష్క్రమించే అవకాశం ఉందని ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఆందోళన వ్యక్తంచేశాయి.


మెచ్యూరిటీ తేదీ కంటే ముందే పాలసీలను ఉపసంహరించుకుంటే పాలసీదారుడికి బీమా కంపెనీలు చెల్లించే మొత్తాన్ని సరెండర్‌ వాల్యూగా పరిగణిస్తారు. పాలసీ కాలవ్యవధి ముగియకుండానే మధ్యలోనే పాలసీదారుడు తన పాలసీని సరెండర్‌ చేస్తే వారికి అప్పటిదాకా వచ్చిన ఆదాయం, పొదుపు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఈ సరెండర్ వాల్యూ నిబంధనలను IRDAI ఇటీవల సవరించింది. గతంలో కంటే ఎక్కువగా పాలసీదారుడికి సరెండర్‌ వాల్యూ చేతికి వచ్చేలా సవరణలు చేసింది.


కొత్త నిబంధనల ప్రకారం.. మూడేళ్ల కాల వ్యవధిలోపు పాలసీలను సరెండర్‌ చేసినా సరెండర్‌ వాల్యూ పాలసీదారుడు చెల్లించిన ప్రీమియం మొత్తానికి సమానంగా లేదా కాస్త తక్కువగా ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం మూడేళ్లలోపు పాలసీ సరెండర్‌కు అవకాశం లేదు. కొత్త రూల్స ప్రకారం.. 4-7 సంవత్సరాల మధ్య పాలసీలను సరెండర్‌ చేస్తే కట్టిన ప్రీమియం కంటే కాస్త ఎక్కువగా వస్తుంది. ఇంకా ఎక్కువ ఏండ్లు పాలసీని కొనసాగిస్తే.. ఇంకా సరెండర్‌ వాల్యూ చేతికి వస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ న్యూ రూల్స్‌ను అమలు చేయాలని IRDAI నిర్ణయించింది.


అయితే బీమా సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో పాత సరెండర్‌ వాల్యూస్‌నే కొనసాగించేందుకు అంగీకరించింది. అలాగే ఇండెక్స్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్‌లను విక్రయించేందుకూ ఆయా సంస్థలకు IRDAI అనుమతిచ్చింది.