Bhatti: భజన శాఖ అయితే బెటర్.. మంత్రి హరీశ్‌రావుపై భట్టి విక్రమార్క ఫైర్
Bhatti మహిళలు కేసీఆర్ రుణం ఎందుకు తీర్చుకోవాలి? ఈ ప్రాంత మినరల్ సెస్ గజ్వేల్, సిద్దిపేట ఎందుకు తరలిస్తున్నారు? పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ఆసుపత్రుల్లో వీల్ చైర్లు లేకపోయినా పట్టింపు లేదు.. భజన చేయడంలో మంత్రి హరీశ్‌రావు ముందుంటారు విధాత, కరీంనగర్ బ్యూరో: ఐకెపి మహిళలు కెసిఆర్ రుణం దేనికోసం తీర్చుకోవాలని మంత్రి హరీశ్ రావుపై ప్రశ్నల వర్షం సంధించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ […]

Bhatti
- మహిళలు కేసీఆర్ రుణం ఎందుకు తీర్చుకోవాలి?
- ఈ ప్రాంత మినరల్ సెస్ గజ్వేల్, సిద్దిపేట ఎందుకు తరలిస్తున్నారు?
- పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర
- ఆసుపత్రుల్లో వీల్ చైర్లు లేకపోయినా పట్టింపు లేదు..
- భజన చేయడంలో మంత్రి హరీశ్‌రావు ముందుంటారు
విధాత, కరీంనగర్ బ్యూరో: ఐకెపి మహిళలు కెసిఆర్ రుణం దేనికోసం తీర్చుకోవాలని మంత్రి హరీశ్ రావుపై ప్రశ్నల వర్షం సంధించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకుని పెద్దపల్లి జిల్లాలోకి అడుగుపెట్టిన ఆయన ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అభయ హస్తం పథకం అటకెక్కించినందుకా ? ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం తొలగించినందుకా? డ్వాక్రా సంఘాల పిల్లలకి స్కాలర్షిప్ పథకాన్ని తీసివేసినందుకా? వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా మహిళలను మోసం చేసినందుకా? హక్కుల కోసం అడిగిన మహిళలను పోలీసులతో బయటకు గెంటి వేయించినందుకా? ఐకెపి మహిళలకు ఏం చేశారని కెసిఆర్ రుణం తీర్చుకోవాలో హరీష్ రావు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు
వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖలను వదిలిపెట్టి భజనశాఖ మంత్రిగా చేరితే బాగుంటుందని, ప్రతి రోజు ముఖ్యమంత్రి భజన చేయొచ్చంటు ఎద్దేవా చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ రావుకు ఆసుపత్రుల్లో వీల్ చైర్లు లేకుండా రోగులు పడుతున్న ఇబ్బందులు పట్టవు.. కానీ కేసీఆర్ భజనలో మాత్రం ముందుంటున్నాడని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించినందుకా? దళిత బంధు 17, 700 కోట్లు కేటాయించి ఏడాది పూర్తి అయినా కేటాయింపులు చేయనందుకా? ఎందుకోసం కెసిఆర్ రుణం తీర్చుకోవాలి అంటూ హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల రెండు లక్షల ఎకరాలు తెలంగాణలో ముంపునకు గురవుతున్నా పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత కడితే ఎగువన 3 వేల ఎకరాలు ముంపుకు గురి అవుతుందని ప్రాజెక్టును రీడిజైన్ చేయడం అవివేకమని మండిపడ్డారు.
1.25 లక్షల కోట్లతో కాళేశ్వరం కట్టామని టిఆర్ఎస్ పాలకులు గొప్పలు చెప్పడం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు నుంచి వస్తున్న నీళ్లు లక్ష్మీ కాలువ, సరస్వతి కాలువ కాకతీయ కాలువలో పారించి కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి ఒక ఎకరానికైనా అదనంగా సాగునీరు ఇచ్చారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి ఇదే రోల్ మోడల్ అంటూ ప్రచారం చేసుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ సంపదను దోపిడీ చేసేందుకే బీఆర్ఎస్ ను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
అతిపెద్ద దోపిడిదారుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విపక్ష కూటమికి నాయకుడిగా ప్రకటిస్తే, దేశవ్యాప్తంగా పార్లమెంటు అభ్యర్థులకు ఎన్నికల కయ్యే ఖర్చు భరిస్తానని కేసీఆర్ చెప్పడాన్ని బట్టి రాష్ట్ర సంపదను ఆయన ఎంతగా దోపిడీ చేశాడో అర్థమవుతుందన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ రాజకీయ చదరంగం ఆడుతుంటే చూడడానికి తెలంగాణ ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉండవని ప్రకటించిన కేసీఆర్ రామగుండం నగరం నడిబొడ్డున ఓపెన్ కాస్ట్ మైనింగ్‌కు అనుమతి ఇచ్చి చిన్నపాటి భూకంపాలకు కారణమయ్యాడని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడం ఈ ప్రాంతానికి శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించాల్సిన ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను కొల్లగొడుతున్నదని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరణ పేరిట ఓపెన్ మైన్స్ ను ఆంధ్ర బడా బాబుల కంపెనీలకు కట్టబెట్టి కార్మికుల నోటికాడ బుక్క గుంజుకుంటున్నదని నిప్పులు చెరిగారు. ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయకుండా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? గాడిదలు కాస్తున్నదా అంటూ ఫైర్ అయ్యారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బీపీఎల్ కంపెనీ ఏర్పాటు కోసం 1200 ఎకరాలు భూసేకరణ చేసి దశాబ్ద కాలమవుతున్నా ఇప్పటివరకు కంపెనీ ఏర్పాటు చేయకుండా ఏం చేస్తున్నారు? కంపెనీ ఏర్పాటు చేయకుంటే సేకరించిన భూములను రైతులకు ఎందుకు తిరిగి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆ భూములను రైతులకు ఇవ్వండి లేకుంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసమైనా కేటాయించాలని డిమాండ్ చేశారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్టు లేబర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేయడం.. ఇంతకంటే దుర్మార్గం ఉందా? అని ప్రశ్నించారు. ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించకపోగా వసూలు చేసిన డబ్బులు బాధితులకు చెల్లించక పోవడంతో నలుగురి ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే ఈ రామగుండానికి అవసరమా? అని ప్రశ్నించారు. ఇసుక దందా, బూడిద దందాలతో కాలం వెళ్లదీయడానికే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినట్టుందని అన్నారు. తన దందాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.
రామగుండంలో ప్రజలకు భావ స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఇసుక, బూడిద, నీళ్లతో పాటు రాబోయే రోజుల్లో గాలిని కూడా అమ్మే దుస్థితికి టిఆర్ఎస్ దిగజారిపోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. పెద్దపల్లి జిల్లా మినరల్ ఫండ్స్ నిధులను జిల్లా అవసరాల కోసం ఖర్చుపెట్టకుండా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు.
బొగ్గు ఖనిజ సంపద ఉన్న రామగుండం ప్రజలు తెలంగాణలో లేరా? వీరి సొమ్ము తీసుకెళ్లే హక్కు
అధికార పార్టీ నేతలకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారానే
కెసిఆర్ దోపిడీకి కళ్లెం పడుతుందన్నారు. దోపిడి పాలనకు చరమ గీతం పాడాలని, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.