Site icon vidhaatha

BJP | తమిళనాట బోణీ కోసం బీజేపీ ఎత్తులు

తమిళనాడులోని 39 స్థానాలకు ఒకేసారి ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనున్నది. డీఎంకే+కాంగ్రెస్‌ కూటమిగా బరిలోకి దిగుతుంటే అన్నాడీఎంకే ఎండీఎంకేతో కలిసి బరిలో దిగుతున్నది. దక్షిణాదిలో ఆపార్టీకి పట్టున్న కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తున్నది. అందుకే చిన్న చిన్న పార్టీలను కలుపుకుని కమలనాథులు పోటీ చేస్తున్నారు. దీంతో ఈసారి తమిళనాడులో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అన్ని పార్టీల సామాజిక సమీకరణాలతో తమ అభ్యర్థులను నిలిపాయి. ఆయా స్థానాల్లో సత్తా చాటడానికి యత్నిస్తున్నాయి.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు స్థానంపై అందరి దృష్టి ఉన్నది. వామపక్షాలు బలంగా ఈ చోట 2009, 2019లో సీపీఎం గెలిచింది. 2014లో అన్నాడీఎంకే ఇక్కడ విజయం సాధించింది. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన అభ్యర్థుల మెజారిటీ తక్కువే ఉన్నది. ఈసారి వామపక్షాలను పక్కనపెట్టి అధికార డీఎంకే బరిలోకి దిగింది. గతంలో కోయంబత్తూర్‌ మేయర్‌గా పనిచేసిన గణపతి కుమార్‌ను పోటీకి నిలిపింది. బీజేపీ నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలో ఉన్నారు. తమిళనాడులో ప్రధాని రోడ్‌ షో నిర్వహించారు. అక్కడ పార్టీకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకునే అన్నామలైకి టికెట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే నుంచి సింగై డి రామచంద్రన్‌ పోటీ చేస్తున్నారు. మూడు పార్టీలు ఈ స్థానంలో గెలువడానికి గట్టిగా కృషి చేస్తున్నాయి.

తమిళనాడులో మరో కీలక స్థానం ధర్మపురి. 2019లో ఇక్కడ డీఎంకే అభ్యర్థి ఎస్‌. సెంథిల్‌ కుమార్‌ 70 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. ఈసారి ఆయనను తప్పించి ఎ.మణికి టికెట్‌ ఇచ్చింది. ఈ స్థానంలో పీఎంకే ప్రాబల్యం ఎక్కువ. 2014లో ఇక్కడ పీఎంకేనే విజయం సాధించింది. పీఎంకే ఈసారి బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి ఆ స్థానంలో పాగా వేయాలని భావిస్తున్నది. అందుకే అక్కడ పీఎంకే నేత అన్బుమణి రాందాస్‌ తన సతీమణి సౌమ్యను పోటీలో నిలిపారు. అన్నాడీంకే నుంచి ఆర్‌. అశోకన్‌ పోటీ చేస్తున్నారు.

పెరంబలూర్‌లో ఈ సారి ముక్కోణపు పోటీ కనిపిస్తున్నది. 2019 ఎన్నికల్లో ఐజేకే అధినేత పారివేందర్‌ డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ గుర్తుపైనే 4 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. తాజాగా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆయన తమతో ఉన్నందుకు అక్కడ కాషాయ పార్టీ విజయం ఖాయమని అనుకుంటున్నది. విద్యావేత్త అయిన పారివేందర్‌ను ఢీ కొట్టడానికి తమిళనాడు రాష్ట్ర మంత్రి కె.ఎన్‌. నెహ్రూ కుమారుడు అరుణ్‌ నెహ్రూకు టికెట్‌ ఇచ్చింది. అన్నాడీఎంకే నుంచి ఎన్‌డీ చంద్రమోహన్‌ పోటీ చేస్తున్నారు. పెరంబలూర్‌ 2009లో డీఎంకే, 2014 అన్నాడీఎంకే విజయం సాధించింది. అయితే ఈ స్థానంలో గెలుపు ఏ పార్టీకి అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version