Nalgonda | విధాత: BJP ఓబీసీ సెల్ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు, దేవరకొండకు చెందిన పులిజాల రఘురాం హత్య కేసు మిస్టరీని దేవరకొండ పోలీసులు చేదించారు. రఘురాంను ఆయన భార్య పులిజాల శ్రీలక్ష్మి ప్రోద్బలంతోనే నిందితులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన రఘురాం అప్పులు చేసి నిత్యం తాగి భార్య శ్రీలక్ష్మిని వేధిస్తుండడంతో ఆమె అతడి అడ్డు తొలగించుకునేందుకు స్నేహితురాలి భర్త చిలక రాజు అరుణ్ సహాయం కోరింది. పథకం మేరకు […]
Nalgonda |
విధాత: BJP ఓబీసీ సెల్ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు, దేవరకొండకు చెందిన పులిజాల రఘురాం హత్య కేసు మిస్టరీని దేవరకొండ పోలీసులు చేదించారు. రఘురాంను ఆయన భార్య పులిజాల శ్రీలక్ష్మి ప్రోద్బలంతోనే నిందితులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడిన రఘురాం అప్పులు చేసి నిత్యం తాగి భార్య శ్రీలక్ష్మిని వేధిస్తుండడంతో ఆమె అతడి అడ్డు తొలగించుకునేందుకు స్నేహితురాలి భర్త చిలక రాజు అరుణ్ సహాయం కోరింది. పథకం మేరకు రఘురాంకు శ్రీలక్ష్మి నిందితుడు అరుణ్ తో లక్ష రూపాయలు అప్పుగా ఇప్పించింది.
దీంతో రఘురాం, అరుణ్‌లు తరచూ కలుస్తూ మద్యం సేవించేవారు. ఈ క్రమంలో ఒక పర్యాయం హత్య చేసే లక్ష్యంతో అధిక మోతాదులో వయాగ్రా మాత్రలు తినిపించారు. ఫలితం లేకపోవడంతో మరోసారి సైనేడ్ తాగించారు. మోతాదు చాలక రఘురాం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
రెండు నెలల తర్వాత మళ్లీ మరో పథకం వేసి తన లక్ష రూపాయలు వెంటనే కావాలని రఘురాంని అరుణ్ కుమార్ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో 50,000 ముందుగా ఇస్తానని చెప్పిన రఘురాం తన వద్ధ పది వేలు మాత్రమే వుండగా, ఆ డబ్బును ఇస్తానని అరుణ్‌కు చెప్పాడు. ఫలానా చోటికి రావాలని అరుణ్ చెప్పగా భార్య శ్రీలక్ష్మిని ఇంటి వద్ద వదిలి స్కూటర్ పై అరుణ్ చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు.
అప్పటికే ముందస్తుగా మరో ముగ్గురితో వేచి వున్నా అరుణ్ అక్కడికి రఘురాం రాగానే డబ్బుల కోసం అతనితో గొడవ పెట్టుకుని నలుగురు అతడిపై దాడి చేశారు. ప్రధాన నిందితుడు అరుణ్ తో పాటు ముక్కెర భాను, పెనుగొండ రవితేజ, సుచిత్రలు రఘురాంను పట్టుకొని సైనైడ్ పొడిని నోట్లో వేశారు.
చనిపోయాడనుకొని కారులో అతడిని మరోచోటికి తీసుకెళ్తుండగా కదలడంతో సైనేడు కలిపిన ద్రవాన్ని తాగించారు. రఘురాం చనిపోయాడని నిర్ధారించుకున్నాకా తిరిగి గొడవ జరిగిన ప్రాంతానికి అతడి మృతదేహాన్ని తీసుకువచ్చి పడేసి వెళ్ళిపోయారని పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.