విధాత : జీవరాశులలో వైవిధ్యం ముఖ్యంగా వణ్యప్రాణుల రకాలు..వాటి మనుగడ ఎప్పుడు సరికొత్త ఆసక్తికర అంశాలను అందిస్తునే ఉంటాయి. బగీరా అనే నల్ల చిరుతపులి కేంద్రంగా వచ్చిన జంగిల్ బుక్ లో సినిమాతో నల్ల చిరుతలు మరింత ఫేమస్ అయిపోయాయి. భారత్‌లో నల్ల చిరుతలు తరుచు దర్శనమిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రాలోని చంద్రపూర్ జిల్లా తడోబా అభయారణ్యంలో పర్యాటకులకు నల్ల చిరుత దర్శనమిచ్చి కనువిందు చేసింది. కొలారా మార్గంలో అభయారణ్యంలో వెలుతున్న కమంలో వారికి నల్ల చిరుత ఎదురుపడింది. చాల అరుదుగా కనిపించే ఈ నల్ల చిరుత ఈ అరణ్యంలో రెండేళ్ల తర్వాతా కనిపించినట్లుగా అటవీ అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లో ఉన్న పులులను ఫొటోలు తీయడం కోసం వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అనురాగ్ గవాండే తన వాహనంలో బృందంతో కలిసి వెళ్లాడు. పులి కోసం వెళుతున్న అనురాగ్‌కు పార్క్‌లోని సరస్సు వైపు జింక అరుస్తున్న శబ్దం వినిపించింది. ఖచ్చితంగా పులి అక్కడ ఉంటుందని వెళ్లిన అనురాగ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. పులి కనిపిస్తుందేమోనని తన వాహనంలో వెళుతున్న క్రమంలో కొద్ది దూరంలో అరుదైన నల్ల చిరుత జింకను వేటాడేందుకు ప్రయత్నిస్తూ సఫారీ వాహనం ఉన్న రోడ్డు వైపుగా వచ్చి ఆగింది. సరిగ్గా ఆ నల్ల చిరుత ఉన్న అదే రోడ్డు మీద 30 అడుగుల దూరంలో తన వాహనంలో ఉన్న అనురాగ్ ఫొటోలను కెమెరాలో బంధించాడు. ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. తడోబా నేషనల్ పార్క్ మొత్తం మీద ఒకే ఒక్క నల్ల చిరుత ఉంది. అలాంటి ఒకే ఒక్క అరుదైన నల్ల చిరుత తన కెమెరాకు చిక్కడం అనురాగ్ అనందాన్ని రెట్టింపు చేసింది.
భారత అభయారణ్యాలలో నల్ల చిరుతలు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని సిమిలిపాల్ నేషనల్ పార్క్‌లో నల్ల చిరుతపులి కనిపించింది. అంతకుముందు దక్షిణ గోవాలోని నేత్రావళి అభయారణ్యంలో కూడా నల్ల చిరుత దర్శనమిచ్చింది. కోయంబత్తూరు అటవీ రేంజ్‌లోని తడగామ్‌లోని నివాస ప్రాంతం సమీపంలోనూ నల్ల చిరుతపులి కనిపించింది. కర్నాటకలోని దండేలి-అన్షి టైగర్ రిజర్వ్‌లోనూ నల్ల చిరుతలు కెమెరాకు చిక్కాయి.
అస్సాం కజిరంగా నేషనల్ పార్కులో బంగారుపులి
అస్సాం కజిరంగా నేషనల్ పార్క్ లో అరుదైన గోల్డెన్ టైగర్ (బంగారు వర్ణపు పులి) సంచారం మరోసారి కెమెరాకు చిక్కింది. ఇటీవలే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేశ్ హెంద్రే ఈ పులి కదలికలను తన కెమెరాలో బంధించడంతో గోల్డెన్ టైగర్ వెలుగులోకి వచ్చింది. నేడు నేషనల్ టూరిజమ్ డే సందర్భంగా ఆ బంగారు పులికి సంబంధించిన ఫొటోను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మెజిస్టిక్ బ్యూటీ..! కాజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన బంగారు పులి కనిపించింది’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ బంగారు పులి ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.