కేసీఆర్‌ మదిలో బంపర్‌ ఆఫర్‌! రైతుల‌కూ జీతాలు?

  • By: krs    latest    Oct 03, 2023 5:13 PM IST
కేసీఆర్‌ మదిలో బంపర్‌ ఆఫర్‌! రైతుల‌కూ జీతాలు?
  • రైతులు, కూలీల‌కు 5 వేల‌ పెన్ష‌న్‌!
  • రైతులకు బేషరతుగా వేతనాలు..
  • కూలీలకు విధివిధానాల మేరకు..
  • ప్రతి నెలా జమ చేసే ఆలోచన..
  •  దిమ్మతిరిగే మ్యానిఫెస్టో ఇదేనా?
  • సర్వేలతో బీఆరెస్‌లో కలవరం
  • తాజా సర్వేలో 48 సీట్లకే పరిమితం!
  • పోటాపోటీగా అసెంబ్లీ ఎన్నికల పోరు
  • జనాల్లోకి బలంగా కాంగ్రెస్‌ హామీలు
  • ఎదుర్కొనేందుకే భారీ తాయిలం?

విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధి, హైద‌రాబాద్‌: హ్యాట్రిక్‌ విజయానికి ఎదురవుతున్న భారీ అడ్డంకులను అధిగమించేందుకు బీఆరెస్‌ అధినేత బంపర్‌ ప్లాన్‌ సిద్ధం చేశారని అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అదే రైతులకు వేతనాలు! ప్రతి నెలా రైతాంగానికి కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా వారి ఖాతాలో జమ చేస్తామని బీఆరెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైతులకు, రైతు కూలీలకు నెలకు 5వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ఉన్నట్టుండి ఇంత భారీ హామీ ఇవ్వటం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు.


నిన్నటిదాకా హ్యాట్రిక్‌ విజయం ఖాయమని ధీమాతో ఉన్న బీఆరెస్‌కు ఓటమి భయం కూడా ఒక కీలక కారణమని, దానితోపాటు కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి చొచ్చుకుపోవడం, తెలంగాణ‌లో తాజా స‌ర్వే ఫ‌లితాలు బీఆరెస్‌కు ప్రతికూలంగా వెలువడుతుండటం కూడా బీఆరెస్‌ ఈ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసుకోవడం వెనుక కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతికూల పరిణామాలను దీటుగా ఎలా ఎదుర్కొనాలన్న అంశం కేంద్ర బిందువుగా బీఆరెస్‌ మ్యానిఫెస్టో రూపకల్పన పనులు ప్రగతిభవన్‌లో ముమ్మరంగా సాగుతున్నాయని తెలుస్తున్నది.


ఈ చర్చల్లోనే రైతులకు వేతనాలు అంశం ముందుకు వచ్చిందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. త్వరలో బీఆరెస్‌ నుంచి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మ్యానిఫెస్టో వస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దిమ్మతిరిగే అంశం రైతులకు వేతనాలేనని తెలిసింది.

బీఆర్ఎస్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న స‌ర్వేలు


ఇటీవల అధికార పార్టీ చేయించుకున్న తాజా సర్వే ఫలితాలు వారికి కలవరం కలిగించాయని చెబుతున్నారు. ఈ స‌ర్వేలో తెలంగాణ‌లోని 115 అసెంబ్లీ సీట్ల‌కుగాను.. 48 సీట్ల‌లో మాత్ర‌మే బీఆరెస్‌కు ఆధిక్య‌ం వచ్చిందని, కాంగ్రెస్‌కు 45, ఎంఐఎంకు 5, బీజేపీకి 04, ఆరుచోట్ల‌ స్వ‌తంత్రులు గెలువ‌బోతున్న‌ట్లు తేలింద‌ని చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఇటీవ‌ల తుక్కుగూడ‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల స‌మ‌క్షంలో ప్ర‌క‌టించిన క‌ర్ణాట‌క త‌ర‌హా ఆరు గ్యారంటీలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఆరు గ్యారంటీలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లిన‌ట్లు చెబుతున్నారు.


ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు బాగా ఆక‌ర్షితుల‌యిన‌ట్లు స‌ర్వేలో వెల్ల‌డ‌యిందంటున్నారు. ఈ ఆరు గ్యారంటీల ఆక‌ర్ష‌ణ నుంచి ఓట‌ర్లను బీఆరెస్‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా కొన్ని రోజులుగా తీవ్ర క‌స‌ర‌త్తు జరుగుతున్నదని సమాచారం. ఈ మేధోమ‌థనంలో నుంచి పుట్టుకొచ్చిందే రైతుకు నెల నెలా జీతం అని స‌మాచారం. భూమి ఉన్న ప్ర‌తి రైతుకూ నెల నెలా ఐదు వేల రూపాయ‌ల జీతం ఇవ్వ‌డం, అలాగే రైతు కూలీల‌కు కూడా కొన్ని ష‌ర‌తుల‌తో అంతే మొత్తాన్ని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల పోటీని త‌ట్టుకోవ‌చ్చ‌ని బీఆరెస్‌ అధినాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

రోజురోజుకు పడిపోతున్న బీజేపీ గ్రాఫ్!


జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లు బీఆరెస్‌తో పోటీ ప‌డిన బీజేపీ.. తెలంగాణ‌లో ఇప్పుడు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. పోల్ ట్రాక‌ర్ సంస్థ తాజా స‌ర్వే ఫ‌లితాల్లో బీజేపీ గ్రాఫ్ సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య సీట్ల అంతరం గణనీయంగా పెరుగుతున్నది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించినప్పటి నుండి, ఒక వారం వ్యవధిలోనే హ‌స్తం గ్రాఫ్ 1.8 శాతం పెరిగిందని చెబుతున్నారు. అధికార బీఆర్‌ఎస్ నుండి వచ్చిన వ‌ల‌స‌ల‌తో అది ఓట్ల వాటాను 1.9 శాతానికి పెంచింది. ఆరు హామీలను ప్రకటించిన రెండు వారాల్లోనే కాంగ్రెస్‌కు ప్ర‌జ‌ల మద్దతు 3.7 శాతానికి చేరుకుంది. ఈ స‌ర్వే ప్ర‌కారం బీఆరెస్ 40 శాతం, కాంగ్రెస్ 35 శాతం ఓట్లు దక్కించుకుంటాయని, బీజేపీకి 8 శాతం ఓట్లు మాత్ర‌మే వస్తాయని అంచనా వేసింది. 38 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు తటస్థంగా ఉంటున్నారు. వీరి నిర్ణయంపైనే తుది ఫలితం ఆధారపడి ఉంటుంది.

అన్ని స‌ర్వేల్లోనూ బీఆర్ ఎస్‌కు గ‌డ్డుకాలం!


పోల్ ట్రాకర్ నిర్వహించిన సర్వేలో సైతం ‘కారు’కు ఎదురీదుతున్నది. పోల్‌ట్రాక‌ర్ తాజా స‌ర్వేలో (2023 సెప్టెంబ‌ర్) 42 శాతం ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ 70 సీట్లు సాధిస్తుంద‌ని తేల్చింది. ల‌క్ష‌ 23 వేల‌మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించిన త‌రువాత స‌ర్వే ఆర్గ‌నైజేష‌న్ అనే మ‌రో సంస్థ కాంగ్రెస్‌కు తెలంగాణ‌లో 63-69 మధ్య సీట్లు వస్తాయని అంచ‌నా వేసింది. బీఆర్‌ఎస్ 34% ఓట్లతో 35-40 సీట్లకే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని, మూడవ స్థానంలో, ఎంఐఎం గరిష్ఠంగా 10% ఓట్లను సాధించి 5-6 సీట్ల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తేల్చింది. తెలంగాణ‌లో 115 సీట్ల‌లో పోటీ చేస్తున్న బీజేపీ 5 సీట్లు మాత్ర‌మే గెలుస్తుంద‌ని ఈ స‌ర్వేలో వెల్ల‌డైంది. ఈ స‌ర్వేను ఉటంకిస్తూ, కాంగ్రెస్ 69-71 సీట్లు, బీఆర్‌ఎస్ 39-41 స్థానాల్లో విజయం సాధిస్తుందని ట్వీట్ చేసింది. రెండు నెలల క్రితం 14శాతం మంది ప్రజలు హంగ్ ఉంటుందని అభిప్రాయ‌ప‌డ‌గా, ఆ సంఖ్య ఇప్పుడు స‌గానికి అంటే 6 శాతానికి పడిపోయింది. ఇలా ఏ స‌ర్వే చూసినా కారు ఎదురీత‌లో ఉంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఓట‌మి భ‌యంతోనే ధిక్కార స్వ‌రాల‌పై మౌనం


నిన్నమొన్నటి దాకా పార్టీని కనుసైగతో శాసించిన కేసీఆర్‌.. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నాయ‌కుల‌ను నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి పంపేవారు. కానీ తాజా స‌ర్వే త‌రువాత పార్టీలో అసంతృప్తుల‌ ప‌ట్ల‌, ధిక్కార స్వరాలు వినిపించేవారి ప‌ట్ల వైఖ‌రి మారింద‌ని చెబుతున్నారు. అసంతృప్త నేత‌ల‌కు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం, కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌ను పంపి, రాజీ కుద‌ర్చ‌డంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌ని చెబుతున్నారు. మ‌రికొంద‌రికేమో చివరి దశలో పదవుల ఎర వేస్తూ కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు నెల‌లే స‌మ‌యం ఉండ‌టం, తెలంగాణ‌లో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకూ పెరుగుతుండ‌టం బీఆరెస్‌ హ్యాట్రిక్ క‌ల‌ల‌కు బ్రేక్ వేసే స్థాయికి చేరింద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

ధిక్కార స్వ‌రాల‌పై మెత‌క వైఖ‌రి!


అన్ని పార్టీల కంటే ముందుగా ఆగస్ట్‌లోనే నాలుగు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకూ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఆనాడు ఎంతో ధీమాగా గెలుపు మాదే అన్నారు. కానీ సర్వేల్లో మాత్రం కాంగ్రెస్‌కు నెల నెలా గ్రాఫ్ పెరుగుతున్న‌ట్లు చూసి క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ ట్రెండ్ చూసి టికెట్‌ ఆశించి భంగపడ్డ బీఆరెస్‌ నేతలు ఒక్కొక్క‌రు ధిక్కార స్వ‌రం వినిపించ‌డం మొద‌లుపెట్టారు. జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యల‌ను స్వ‌యంగా కేటీఆర్ వెళ్లి రాజీకి ఒప్పించారు. ఆ మ‌రుస‌టి రోజే వారు భిన్నంగా మాట్లాడటం విశేషం. ఏళ్లుగా భర్తీ చేయని పదవులను చూపెట్టి మ‌రికొంద‌రిని చ‌ల్ల‌బ‌రుస్తున్నారనే అభిప్రాయం ఉన్నది.


రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్నం మహేందర్‌ రెడ్డి అధిష్ఠానంపై అసంతృప్తితో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి వరించింది. మంత్రి హరీశ్‌రావుపై, పార్టీ అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విషయంలో పార్టీ పెద్దలు మౌనమే వహించారు. అయినా మైనంప‌ల్లి కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల్లో పదేళ్లు బీఆరెస్‌ పాలన చూశామని, ఈసారి కాంగ్రెస్‌కు అవ‌కాశం ఇద్దామ‌నే అభిప్రాయాన్ని స‌ర్వేల్లో వ్యక్తమవుతున్నదని, ఇది బీఆరెస్‌కు మింగుడు పడే విషయం కాదని అంటున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కేటీఆర్‌, కేసీఆర్ స్పందించిన తీరుతో సెటిల‌ర్ల ఓట్ల‌ను కూడా దూరం చేసుకున్న‌ట్టు అయింద‌ని ఒక రాజ‌కీయ ప‌రిశీల‌కుడు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈసారి సెటిల‌ర్లు, టీడీపీ మ‌ద్ద‌తుదారుల ఓట్లు ఏక‌ప‌క్షంగా కాంగ్రెస్ పార్టీకి ప‌డ‌తాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.