ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి రాజ్యమే కదా..? : సీఎం కేసీఆర్
ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి రాజ్యమే కదా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.

వేములవాడ : ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి రాజ్యమే కదా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి, రూ. 2కే కిలో బియ్యం ఇచ్చిన తర్వాత పేదల కడుపులు నిండాయని కేసీఆర్ గుర్తు చేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పార్టీ అభ్యర్థి లక్ష్మీ నరసింహరావుకు మద్దతుగా ప్రసంగించారు.
వేములవాడ చైతన్యవంతమైన ప్రాంతం. మేధావులు ఉండే ప్రాంతం. వేమువాలడ పట్టణానికి నాకు ఒక అనుబంధం ఉంది. రాజరాజేశ్వర స్వామి కొలువైన ఈ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నా జీవితంలో ప్రధాన ఘట్టం నా పెండ్లి ఇదే ఆలయంలో జరిగింది. అందుకే వేములవాడతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది అని కేసీఆర్ తెలిపారు.
చెన్నమనేని రమేశ్ నిజాయితీ గల ఎమ్మెల్యే. ఆయనను మార్చే అవసరం లేకుండే. కోర్టులో దిక్కుమాలిన కేసు వల్ల గడబిడ ఉండే. మళ్ల ఆ పరేషాన్ ఎందుకని చెప్పి ఆయనను అంతకన్న ఉన్నత పదవిలో ఉంచుకుందామని చెప్పి, లక్ష్మీ నరసింహారావును ఇవాళ మనం నిలబెట్టుకున్నాం. నరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.
ఇందిరమ్మ రాజ్యంలో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలను కల్లోలిత ప్రాంతాలుగా డిక్లేర్ చేసి ఎంతో మంది యువకులను కాల్చిచంపారు. ఎంతో మందిని పొట్టనపెట్టుకున్నారు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే. ఎమర్జెన్సీ పెట్టి లక్షల మందిని జైల్లో వేశారు. మంచి జరిగిందా..? అంటే జరగలేదు. ఎవరో యెన్కట తద్దినం ఉంది రమ్మని పిలిస్తే.. బాగా మెక్కి రోజు మీ ఇంట్లో ఇట్లనే జరగాలని అన్నడట. అట్ల ఉంది ఇవాళ పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందిమ్మ రాజ్యం తెస్తమంటే ఎవరి కొంప పుచ్చుకోవడానికి.
కాలం చెల్లిపోయిన ఇందిరమ్మరాజ్యం తెస్తమంటే ఇక్కడ ఎవడు మోసోవాలి. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. రామారావు 2 రూపాయాలకే బియ్యం ఇచ్చే వరకు ఆకలి కడుపుతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి రాజ్యమే. రామారావు వచ్చిన తర్వాత పేదల కడుపులు నిండాయి. ఇందిరమ్మ రాజ్యం తెస్తరంట మళ్ల.. మళ్లీ ఆకలికి చావాల్నేమో..? మళ్లీ కరెంట్ షాకులతో రైతులు చనిపోవాల్నేమో..? అభివృద్ధితో పాటు ఇతర విషయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని కేసీఆర్ తెలిపారు.