CM KCR | ఉమ్మ‌డి ఏపీలో పాల‌మూరు జిల్లాది ఒక విషాద గాథ : సీఎం కేసీఆర్

CM KCR | హైద‌రాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు జిల్లాది ఒక విషాద గాథ అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. ఈ ప‌థ‌కం ప్రారంభంతో ఆరు జిల్లాలు స‌స్య‌శ్యామ‌లం కాబోతున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో నిర్వ‌హించిన తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వంలో పాల్గొని కేసీఆర్ జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం ప్ర‌సంగించారు. పాల‌మూరు […]

  • By: raj    latest    Sep 17, 2023 7:18 AM IST
CM KCR | ఉమ్మ‌డి ఏపీలో పాల‌మూరు జిల్లాది ఒక విషాద గాథ : సీఎం కేసీఆర్

CM KCR | హైద‌రాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు జిల్లాది ఒక విషాద గాథ అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. ఈ ప‌థ‌కం ప్రారంభంతో ఆరు జిల్లాలు స‌స్య‌శ్యామ‌లం కాబోతున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో నిర్వ‌హించిన తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వంలో పాల్గొని కేసీఆర్ జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం ప్ర‌సంగించారు.

పాల‌మూరు వ‌ల‌సల‌ దుస్థితికి క‌న్నీటి సాక్షుల‌మే..

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని సీఎం తెలిపారు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రం కొనసాగి ఉంటే, అప్పర్ కృష్ణా, తుంగభద్ర, బీమా ఎడమ కాలువ ద్వారా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటువల్ల ఈ అవకాశం పోగొట్టుకున్నాం.

పాలమూరు జిల్లాలో అప్పట్లో వ్యవసాయయోగ్యమైన భూమి 35 లక్షల ఎకరాలు కాగా, ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి కేవలం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే. దీంతో పాలమూరు ప్రజలకు బతుకుతెరువు కోసం వలసలే గతి అయ్యాయి. 60 ఎకరాలు భూమి ఉన్న రైతు కూడా పొట్టచేతబట్టుకొని పట్నానికి వలస వచ్చి కూలి పనులు చేసుకునే దుస్థితికి మనందరం కన్నీటి సాక్షులమే అని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నీచ చరిత్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులది

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సందర్భంలో తెలంగాణ రిటైర్డు ఇంజనీర్లు 2005లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పనచేసి అప్పటి ఉమ్మడి రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇస్తే, ఆనాటి పాలకులు దాన్ని బుట్టదాఖలు చేశార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. జిల్లా నాయకుల్లో దాన్ని పట్టించుకున్నవారే లేరు. తలాపున కృష్ణమ్మ పారుతున్నా, నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో, వివక్షతో తాగునీరు, సాగునీటికి నోచుకోక దశాబ్దాల పాటు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవించాయి. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులను పేరుకు మొదలు పెట్టాలె, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆపేసి పెండింగులో పెట్టాలె. ఇదీ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి.
ఒకనాడు సుసంపన్నంగా వెలుగొందిన పాలమూరులో గంజికేంద్రాలు నడపాల్సిన దుర్గతి పట్టించిన నీచ చరిత్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులది అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఎంతో న్యాయ పోరాటం తరువాత ..

ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద ప్రధానంగా దృష్టి సారించింది అని కేసీఆర్ తెలిపారు. పాలమూరు పరిధిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలుపెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది. దీంతోఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడటం ప్రారంభమైంది. వలస పోయినోళ్లు వాపస్ రావడమే కాదు,పాలమూరులో జోరుగా సాగుతున్న వ్యవసాయ పనులకు బయటి రాష్ట్రాల నుంచి కూలీలు వలసొచ్చే స్థాయికి పాలమూరును అభివృద్ధి చేసుకున్నం.

దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయాలని సంకల్పిస్తే, ప్రతీఘాతుక శక్తులు అడుగడుగునా అడ్డంకులు కల్పించాయి. స్వయానా పాలమూరు జిల్లా ప్రతిపక్ష నాయకులే కొందరు, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వందలాది కేసులు పెట్టారు. అయినా మొక్కవోని పట్టుదలతో, దృఢ సంకల్పంతో పనులు కొనసాగించాం. చివరికి ధర్మమే గెలిచింది. ఎంతో న్యాయ పోరాటం తరువాత పర్యావరణ అనుమతులను కూడా సాధించి ప్రాజెక్టును ప్రారంభించుకోగలిగాం అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

సాగునీటిరంగ చరిత్రలో సువర్ణాధ్యాయం

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ఇన్ టేక్ నుండి నిన్ననే బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలలను ఎత్తిపోసే పంపులను ప్రారంభించుకున్నాం. తెలంగాణ సాగునీటిరంగ చరిత్రలో ఇది మరో సువర్ణాధ్యాయం. నిన్నటి రోజు ఆరు జిల్లాల ప్రజల ఆశలు తీరిన నిజమైన పండుగరోజు. ప్రపంచంలో మరెక్కడాలేనటువంటి అత్యంత భారీ పంపులతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి.

మనం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారం చేసుకోగలిగాం. కరువు జిల్లాల రైతాంగం కష్టాలు తీరిన పర్వదినంగా నిన్నటి రోజు చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పండుగను గ్రామగ్రామాన పెద్దఎత్తున సంబురాలతో జరుపుకుంటున్నాం. కృష్ణా జలాలలతో ఆయా గ్రామాలలోని దేవతల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకుంటున్నాం అని తెలిపారు.

6 జిల్లాల్లోని 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు

పర్యావరణ అనుమతులతోపాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాల్వల పనుల కోసం ఇప్పటికే ఆదేశాలివ్వడం జరిగిందని కేసీఆర్ తెలిపారు. మిగిలిన పనులను చకచకా పూర్తి చేసుకోబోతున్నాం. దీంతో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లా.. మొత్తం 6 జిల్లాల్లోని 12 లక్షల 30 వేల ఎకరాల భూములకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.