Telangana Future City | 31వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ.. ల్యాండ్‌ పూలింగ్‌లో అదనపు భూముల సేకరణ

ఫ్యూచర్‌ సిటీని మొత్తం 31వేల ఎకరాల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం.. ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమికి మరో 16వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో సేకరించాలని అధికారులను ఆదేశించారు.

Telangana Future City | 31వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ.. ల్యాండ్‌ పూలింగ్‌లో అదనపు భూముల సేకరణ
  • ఇప్పటికే ఆధీనంలో 13,973 ఎకరాలు
  • ల్యాండ్‌ పూలింగ్‌తో అదనంగా మరో 16వేల ఎకరాలు
  • అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశం

విధాత, హైదరాబాద్:
Telangana Future City | రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదించిన భారత్ ప్యూచర్ సిటీకి మరింత అదనపు భూమి అందుబాటులోకి రానున్నది. కొత్తపల్లి మండలంలో 2,200 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ప్యూచర్ సిటీ కోసం వినియోగించనున్నారు. ఈ మేరకు టీజీఐఐసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూ సేకరణ పూర్తయితే మొత్తం 31వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ విస్తరించనున్నది. ప్రస్తుతం భారత్ ప్యూచర్ సిటీ ఆధీనంలో 13,973 ఎకరాల వరకు ఉంది. ప్రాజెక్టును పట్టాల పైకి ఎక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఏపీలోని మచిలీపట్నం వరకు వయా అమరావతి మీదుగా ఎనిమిది లేన్ల రోడ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగు లేన్ల రోడ్డుతో పాటు మెట్రో రైలు నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. వికారాబాద్ జిల్లాలోని లగచర్లకు కూడా నాలుగు లేన్ల రోడ్డు నిర్మించనున్నారు.

2,200 ఎకరాల అసైన్డ్‌ భూములు

కొత్తపల్లి మండలంలో సుమారు 2,200 ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయి. ఈ భూములు లబ్ధిదారుల చేతుల్లో కాకుండా ఇతరుల చేతుల్లో ఉండటంతో స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ భూముల కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ) సర్వే నిర్వహించింది. సర్వే నంబర్లు 32, 178, 182, 222, 242, 317లో పెద్ద ఎత్తున అసైన్డ్‌ భూములున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ఫార్మా సిటీకోసం బీఆరెస్‌ ప్రభుత్వ యత్నం

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 19,333 ఎకరాలను ఫార్మాసిటీ కోసం సేకరించాలని నిర్ణయించారు. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలంలోని 10 గ్రామాల్లో భూములను గుర్తించారు. ఈ గ్రామాల్లో 10వేల ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు అనువుగా ఉన్నట్లు తేల్చారు. మొత్తం 7వేల ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సేకరించి ఫార్మా సిటీ కోసం సిద్ధం చేశారు. దీంతో కలిపితే మొత్తం 13,973 ఎకరాల భూమి ప్యూచర్ సిటీ ఆధీనంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫార్మా సిటీ బదులు ప్యూచర్ సిటీని ప్రతిపాదించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్ధు చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్థానికులకు హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే ఫార్మా సిటీని రద్దు చేసి, ప్యూచర్ సిటీని డెవలప్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అయితే 2,200 ఎకరాల్లో 1,800 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా 800 మంది రైతులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, పరిహారాన్ని కోర్టు ఖాతాలో డిపాజిట్ చేశారు. ఈ భూములను టీజీఐఐసీకి బదలాయించారు. తమ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారంటూ బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పరిహారం మొత్తాన్ని కోర్టు ఖాతాలో డిపాజిట్ చేశారు. ఒకవేళ పరిహారం మొత్తం పెంచాలని తీర్పు ఇస్తే, ఆ ప్రకారంగా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరో 432 ఎకరాలు వివాదంలో ఉన్నాయని, ఆ సమస్యను కూడా పరిష్కరించి స్వాధీనం చేసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పరిహారం తేల్చకుండా భూసేకరణ

తక్కల్లపల్లి లోని నాగార్జున సాగర్ హైవే రోడ్డు నుంచి ఫార్మా సిటీ వరకు వంద అడుగుల రోడ్డు కోసం భూ సేకరణ చేయనున్నారు. ఈ ప్రక్రియను భూ సేకరణ అధికారులు మొదలు పెట్టారు. మొత్తం 5.9 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డు కోసం భూమిని వీలైనంత త్వరలో సేకరించి, రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించనున్నారు. కాగా ఈ రోడ్డులో పది మంది రైతులు భూములు కోల్పోతున్నారు, మిగతా భూమి లేఅవుట్ వెంచర్ల భూమిగా అధికారులు గుర్తించారు. ఈ రోడ్డులో భూములు కోల్పోయిన వారికి భూ మార్పిడి పన్నుల నుంచి మినహాయింపు కూడా ఇస్తున్నారు. అయితే పరిహారం ఎంత ఇస్తున్నారనేది తేల్చకుండా తమ భూములను ప్యూచర్ సిటీ కోసం స్వాధీనం చేసుకుంటున్నారని బాధిత రైతులు, భూ యజమానులు వాపోతున్నారు. టీజీఐఐసీ బోర్డులను పాతడానికి వెళ్ళిన సర్వే సిబ్బందిని రైతులు అడ్డుకుంటున్నారు. దీంతో అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగారు.

ప్రతి రైతుకు 121 చదరపు గజాల డెవలప్డ్‌ భూమి

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే నిర్వహించామని, ఎంత మొత్తం పరిహారం ఇవ్వాలనేది ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని యాచారం రెవెన్యూ అధికారులు వెల్లడించారు. పరిహారంతో పాటు కొంత డెవలప్ చేసిన ప్లాట్ ను ఇవ్వాలని ప్రభుత్వంలోని పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ప్యూచర్ సిటీ కోసం 13,973 ఎకరాలు సేకరించగా, అదనంగా మరో 16వేల ఎకరాలను కూడా సేకరించే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఈ 16వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించనున్నారు. రైతులు, భూ యజమానులకు నష్టం లేకుండా ఆమోదయోగ్యంగా పరిహారం ఖరారు చేయాలని, ప్రతి ఒక్క రైతుకు 121 చదరపు గజాల డెవలప్ చేసిన భూమిని ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.