అదనపు వడ్డీ చెల్లించలేదని.. మహిళను నగ్నంగా ఊరేగించి.. నోట్లో మూత్రం పోయించాడు

విధాత: ఓ వడ్డీ వ్యాపారి వికృత చర్యకు పాల్పడ్డాడు. అదనపు వడ్డీ చెల్లించలేదనే నెపంతో ఓ మహిళను నగ్నంగా ఊరేగించాడు. అంతటితో ఆగకుండా ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఈ అమానవీయ ఘటన బీహార్ పాట్నా జిల్లాలోని మోసింపూర్ గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మోసింపూర్ గ్రామానికి చెందిన ప్రమోద్ సింగ్ వద్ద.. అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి రూ. 1500 అప్పుగా తీసుకున్నాడు. సమయానికి అసలుతో సహా వడ్డీ చెల్లించాడు సదరు వ్యక్తి. అయితే నగదుకు అదనపు వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ అతన్ని బెదిరించాడు. లేకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి, అతని భార్య అదనపు వడ్డీ చెల్లించేందుకు అంగీకరించలేదు.
దీంతో ప్రమోద్ సింగ్.. బాధితుడి ఇంటికి శనివారం రాత్రి వెళ్లాడు. అతడి భార్యను తన అనుచరులతో కలిసి బయటకు లాక్కొచ్చాడు. అనంతరం ఆమె బట్టలూడదూసి నగ్నంగా ఊరేగించాడు. అంతటితో ఆగకుండా ప్రమోద్ తన కుమారుడి చేత ఆమె నోట్లో మూత్రం పోయించి, హింసించాడు.
ప్రమోద్ సింగ్, అతని అనుచరుల నుంచి తప్పించుకున్న బాధితురాలు.. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమోద్ సింగ్‌తో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.