Delhi | ఓ నవజాత శిశువు చనిపోయిందని వైద్యులు ధృవీకరించి, బేబీని బాక్సులో పెట్టి ఇంటికి పంపించేశారు. కానీ ఖననానికి కొద్ది క్షణాల ముందు ఆ శిశువు తన కాళ్లను, చేతులను కదిలించింది. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ గర్భిణికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఎల్ఎన్‌జేసీ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. 23 వారాల గర్భిణి.. 490 గ్రాముల శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసిబిడ్డను వైద్య సిబ్బంది పరీక్షించి, చనిపోయిందని చెప్పారు. దీంతో పాపను బాక్సులో పెట్టి ఇంటికి పంపించేశారు.
ఖననానికి ముందు కాళ్లు, చేతులు కదిలించింది..
పాపను ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.. ఖననానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం పసిబిడ్డను బాక్స్ నుంచి బయటకు తీశారు. ఆ సమయంలో పాప తన కాళ్లు, చేతులను కదిలించింది. దీంతో పాపను తీసుకొని ఆస్పత్రికి పరుగెత్తారు. కానీ వైద్యులు పాపను అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారు.
పోలీసుల రంగ ప్రవేశంతో..
బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసుల ఆదేశాలతో పాపను ఆస్పత్రిలో చేర్చుకుని వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తల్లీకి కూడా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.