Site icon vidhaatha

MLA Redya Naik | డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు గడ్డు కాలం

MLA Redya Naik

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌కు గడ్డుకాలం వచ్చింది. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని అవమానాలను ఆయన ఈ సారి ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా నియోజకవర్గ ప్రజల నుండి తిరుగుబాటు ప్రారంభం అయ్యిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా ఈసారి కూడా ఎన్నికల్లో మళ్ళీ తానే పోటీ చేస్తానంటూ, అధిష్టానం ఆశీస్సులు తనకే లభించాయంటూ రెడ్యా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

రెడ్యానాయక్‌ ప్రకటనకు భిన్నంగా ఈసారి ఆయనకు పోటీ చేసే అవకాశం లేదనే చర్చ మరోవైపు జోరుగా సాగుతోంది. సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా పైన తన నియోజకవర్గ ప్రజలనుంచి ఈ తిరుగుబాటు ప్రారంభం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గులాబీ పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ దఫా డోర్నకల్ రాజకీయాల్లో మార్పు తప్పదా? అనే ఆసక్తికరమైన చర్చలు వినిపిస్తున్నాయి.

– రెడ్యాకు తప్పని అవమానాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకునిగా డీఎస్ రెడ్యానాయక్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అలాంటి నాయకుడికి ఈ దఫా చిక్కులు ఎదురవుతున్నాయి. ఎన్నడూ లేనిది తన నియోజకవర్గ పరిధిలోని పల్లెవాసులు, తన సామాజిక వర్గానికిచెందిన తండా జనాలు కూడా ముఖం మీదనే నిలేస్తున్నారు. మా ఊరికి ఏం చేశావంటూ ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఏ మండలానికి వెళ్లినా, ఎక్కడికి పోయినా ఆయనకు నిరసనలు ఎదురవుతున్నాయి.

– ఏం చేశావు అంటూ ముఖం మీదే ఆగ్రహం

గత కొద్ది రోజుల క్రితం రెడ్యానాయక్‌ తన నియోజకవర్గంలో పల్లె పల్లెకు పర్యటన ప్రారంభించారు. ఈ నియోజక‌వర్గ పర్య‌ట‌న‌లో ఇటీవ‌ల వ‌రుస‌గా ఆయ‌న‌కు చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. నిన్నటికినిన్న కురవి మండలంలోని కందికొండ, సూదనపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ప‌ర్య‌టించారు. సూద‌న‌ప‌ల్లి గ్రామంలో కొంద‌రు గ్రామ‌స్తులు అడ్డుత‌గిలారు.

ఇన్ని రోజులు ఎటు పోయిన‌వ్? మా గ్రామానికి ఏం చేసిన‌వంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇప్ప‌డు ఎందుకొచ్చావ్ అంటూ నిల‌దీశారు. వారికి స‌మాధానం చెప్ప‌కుండా వెళుతుంటే గ్రామ‌స్తులు ఆయ‌న్ను చుట్టుముట్ట‌డంతో పోలీసులు జోక్యం చేసుకుని నచ్చ‌జెప్పి ఎమ్మెల్యేను కారులో ఎక్కించి పంపారు.

తాజాగా అయ్య‌గారిప‌ల్లి గ్రామంలో ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ ఆవిష్క‌రించాల్సిన శిలాఫ‌ల‌కాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేయ‌డం క‌ల‌క‌లంరేపింది. మ‌రో నాలుగు నెల‌ల్లో ఎన్నిక‌లు ఉండ‌గా, డోర్న‌క‌ల్ నియోజ‌క‌ర్గంలో జరుగుతున్న ఈ ప‌రిణామాలు ఎటు దారి తీస్తాయోన‌ని బీఆర్ఎస్ నాయ‌కులు, గులాబీ శ్రేణులు మ‌దన‌పడుతున్నాయి.

– నియోజకవర్గం అంతటా నిరసన

గ‌తంలో మ‌రిపెడ‌, న‌ర్సింహుల‌పేట మండ‌లాల్లో రెడ్యాకు ఇదే ప‌రిస్థితి ఎదురైంది. స్థానిక స‌మ‌స్య‌ల‌పై యువ‌కులు ఎమ్మెల్యేను నిల‌దీశారు. ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ ఇన్నేండ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఇలాంటి ప్ర‌తికూల పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదనే చ‌ర్చ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం న‌ర్సింహుల‌పేట మండ‌లంలో అజ్మీర‌తండా, గోప‌తండాలోనూ ఎమ్మెల్యేకు నిల‌దీత‌లు ఎదుర‌య్యాయి.

గ్రామాభివృద్ధి, స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించిన జ‌నాల‌ను స్థానిక బీఆర్ఎస్ నేత‌లు అద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేసినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఎమ్మెల్యే, ఆయన అనుచ‌ర‌గ‌ణంపై నిర‌స‌న వ్యక్తం చేశారు. రెడ్యానాయక్ మాట్లాడుతుండ‌గా కేసీఆర్ తమకు ఏం చేశాడని అజ్మీర మంగ్ని అనే మహిళ నిలదీసింది. తండాలో సౌకర్యాలు లేవని నిలదీయడంతో ఆగ్ర‌హం చెందిన ఎమ్మెల్యే ఆమె పెన్షన్ తీసివేయాలంటూ పంచాయతీ కార్యదర్శిని అక్క‌డే ఆదేశించ‌డం వివాదస్పదమైంది.

తర్వాత అజ్మీర తండాలో ఎమ్మెల్యేను ప్ర‌శ్నిస్తున్న గ్రామ‌స్థుల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా స‌మావేశం నుంచి లాక్కెళ్లారు. స‌మ‌స్య‌ల‌పై ఎమ్మెల్యేను ప్ర‌శ్నిస్తే పింఛ‌న్ క‌ట్ చేయ‌డం ఏంట‌ని, ఇది ఎంత వ‌ర‌కు సమంజసం మంటూ నిరసన వ్యక్తమైంది.

తదుపరి డోర్నకల్ మండలం వుణ్య తండా గ్రామ పరిధిలోని బోడహట్య తండాలో బొడ్రాయి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి రెడ్యానాయక్ హాజరయ్యారు. అక్కడున్న తండావాసులు, మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. భగీరథ నీళ్లు రావడం లేదని ఎమ్మెల్యేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మిమ్మ‌ల్ని ఎన్నుకుని ఏం లాభం అంటూ జ‌నం ఆగ్ర‌హం ప్రదర్శించారు. ఎమ్మెల్యేను మాట్లాడకుండా అడ్డుకున్నారు.

– కొత్త చిక్కుల్లో రెడ్యానాయక్‌

గిరిజ‌న నేత‌గా, సుదీర్ఘ‌కాలంగా ప్ర‌జాప్ర‌తినిధిగా ప‌నిచేసిన రెడ్యాకు ఇప్పుడు అదే సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న వ‌రుస ఎదురు దాడుల‌తో రెడ్యానాయ‌క్ తీవ్ర ఆందోళనకు గుర‌వుతున్నారు.

ఎమ్మెల్యే రెడ్యా నాయ‌క్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని, ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌లంటూ అభ్య‌ర్థిగా ప్ర‌చారానికి తెర‌లేప‌డం సొంత పార్టీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లకు దారితీస్తోంది. ఇంత బాహాటంగా ప్ర‌జ‌ల్లో నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్నందున ఈ దశలో రెడ్యానాయ‌క్‌పై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోననే చర్చ జోరుగా సాగుతోంది.

Exit mobile version