- ప్రజలపైన బూతుమాటలు
- లోకల్, నాన్ లోకల్ అంటూ తీవ్ర విమర్శలు
- వైరల్ గా మారిన రెడ్యా వీడియో
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ‘మీకు సిగ్గు శరం ఉంటే సూర్యాపేటోనికి ఎట్లెస్తరూ… నేను లోకల్ నాకే ఎయ్యాల గదా? మీరు చెప్పిందే కదా… లోకలోనికి ఓటు వేయాలంటే, రెడ్యానాయక్‌కు వెయ్యాలి. అవునా కాదా చెప్పండి… మీరు చెప్పిందే’ అంటూ డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి రెడ్యానాయక్ జనానికి ఉపదేశం చేశారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రెడ్యానాయక్ నోటి నుంచి వెలువడిన మాటలు విని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల రెడ్యానాయక్‌ను ప్రచారం సందర్భంగా గ్రామీణ ప్రజలు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ మా ప్రాంతానికి ఏం చేశావంటూ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికల ప్రచారంలో కూడా నోటి దురుసుతనం ప్రదర్శించడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలో దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో రెండురోజుల క్రితం ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఓటర్లను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనాన్ని పట్టుకొని సిగ్గు, శరం వుంటే సూర్యాపేటోనికి ఎట్లా ఓటు వేస్తారు.. నేను లోకల్ నాకే ఓటెయ్యాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఓట్లు అడగడానికి వచ్చిన సీనియర్ ఎమ్మెల్యే ఇలా బాధ్యత మర్చి ప్రవర్తించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మేము ఎటు ఓటు వేయాలో చెప్పడానికి నువ్వు ఎవరు? మా ఊర్లో బాగా అభివృద్ధి చేసినావు గాని మల్లొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావా? అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుల విమర్శ
వేరే వాళ్లకి ఇక్కడ ఓటు అడిగే హక్కులేదు సరే, మరి నీ బిడ్డ ఇల్లందు నియోజకవర్గమైతే మానుకోటలో ఎందుకు నిలబడుతుందో సమాధానం చెప్పు అంటూ ప్రశ్నించారు. పక్క నియోజకవర్గానికి చెందిన మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానికుడా అంటూ ప్రశ్నించారు. రామచంద్రనాయక్ స్వస్థలం పాలకుర్తి నియోజకవర్గం అనే విషయం మరిచిపోయి విమర్శించడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రామచంద్ర నాయక్ టికెట్ రాగానే రెడ్యాకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు ఏం మాట్లాడుతున్నాడో.. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు.