యుద్ధంలో ఇరాన్‌ ఓడిపోయింది.. అందుకే పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పింది : ట్రంప్‌

యుద్ధంలో ఇరాన్‌ ఓడిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల కారణంగానే పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పిందన్నారు.

  • By: TAAZ |    news |    Published on : Mar 07, 2026 6:23 PM IST
యుద్ధంలో ఇరాన్‌ ఓడిపోయింది.. అందుకే పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పింది : ట్రంప్‌

Donald Trump | ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌ ఓడిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించుకున్నారు. అంతేకాకుండా.. మధ్య ఆసియాలోని పొరుగుదేశాలకు లొంగిపోయిందని, క్షమాపణలు చెప్పిందని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఉద్రిక్తతల నివారణకు కృషి చేస్తున్నామని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటలకు ట్రంప్‌ పై విధంగా స్పందించారు. తాము చేసిన దాడులపై పొరుగుదేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్‌ అధ్యక్షుడు.. పొరుగు దేశాల నుంచి దాడి జరుగకపోతే వాటిపై క్షిపణలు ప్రయోగించవద్దని సాయుధ దళాలకు ఆదేశాలు జారీ చేశామని శనివారం తెలిపారు. ఇరాన్‌ పొరుగు దేశాలను తమ సోదరులుగా పెజిష్కియన్‌ అభివర్ణించారు. తమకు పొరుగు దేశాలపై దాడులు చేయాలనే ఉద్దేశం లేదని చెప్పారు.

ఇరాన్‌ అధ్యక్షుడు చెప్పిన ఈ మాటలను ప్రస్తావించిన ట్రంప్‌.. పొరుగు దేశాలపై కాల్పులు జరుపబోమని హామీ ఇవ్వడం అనేది అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల ఫలితమేనని చెప్పారు. ‘నరకానికి తరమబడుతున్న ఇరాన్‌.. క్షమాపణలు చెప్పింది. మధ్య ఆసియాలోని పొరుగు దేశాలకు లొంగిపోయింది. ఇకపై కాల్పులు జరుపబోమని హామీ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు నిరవధికంగా చేస్తున్న దాడుల ఫలితంగానే ఈ హామీ వచ్చింది’ అని ట్రంప్‌ తన సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నారు. మధ్య ఆసియాలను తన ఆధీనంలోకి తీసుకుని పాలించాలని ఇరాన్‌ చూస్తున్నదని ట్రంప్‌ ఆరోపించారు. వేల సంవత్సరాల్లో పొరుగు దేశాలతో ఇరాన్‌ ఓడిపోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఇరాన్‌ క్షమాపణలు చెప్పిన తర్వాత మధ్య ఆసియాలోని దేశాలు తనకు కృతజ్ఞతలు తెలిపాయని ట్రంప్‌ రాశారు. ‘థ్యాంక్యూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌.. అని వారు చెప్పారు. అందుకు తాను ప్రతిగా.. యూ ఆర్‌ వెల్‌కమ్‌ అని చెప్పాను’ అని తెలిపారు.

ఇకపై ఇరాన్‌ ‘మధ్య ఆసియాను బెదిరించే శక్తి’ కాదని, మధ్య ఆసియాలో పరాజిత దేశమని అభివర్ణించారు. ఇరాన్‌ చెడు ప్రవర్తన కారణంగా.. ఇప్పటి వరకూ అనుకోని టార్గెట్‌లపై కూడా దాడులు చేస్తున్నామని ట్రంప్‌ తెలిపారు. శనివారం అత్యంత తీవ్రస్థాయిలో దాడులు చేశామన్నారు.