ఆమె ఆచూకీ చెప్తే రూ.8.5 ల‌క్ష‌ల న‌జ‌రానా!

నాలుగేండ్ల క్రితం క‌నిపించ‌కుండా పోయిన 28 ఏండ్ల‌ భారతీయ విద్యార్థిని మయూషి భగత్ ఆచూకీ తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ది.

ఆమె ఆచూకీ చెప్తే రూ.8.5 ల‌క్ష‌ల న‌జ‌రానా!
  • ఆమెరికా ఎఫ్‌బీఐ భారీ బంప‌ర్ ఆఫ‌ర్‌
  • నాలుగేండ్ల క్రితం అదృశ్య‌మైన భార‌త విద్యార్థిని
  • మయూషి భగత్ కోసం గాలిస్తున్న పోలీసులు


విధాత‌: నాలుగేండ్ల క్రితం క‌నిపించ‌కుండా పోయిన 28 ఏండ్ల‌ భారతీయ విద్యార్థిని మయూషి భగత్ ఆచూకీ తెలుసుకునేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ది. మయూషి కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి సుమారు రూ.8.5 ల‌క్ష‌ల ($10,000) నజ‌రానా ఇవ్వ‌నున్న‌ట్టు తాజాగా ప్ర‌క‌టించింది. 2016లో అమెరికాకు వచ్చి 2019 మే 1న తప్పిపోయిన ఆయూషి లొకేషన్ లేదా రికవరీకి సంబంధిచిన సమాచారం ఇచ్చిన వారిని ఈ న‌గ‌దు బ‌హుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్టు ఎఫ్‌బీఐ మీడియాకు వెల్ల‌డించింది.


మ‌యూషి త‌ప్పిపోయిన మూడేండ్ల తర్వాత ఎఫ్‌బీఐ ఆమెను 2022లో “తప్పిపోయిన వ్యక్తుల” జాబితాలో చేర్చింది. ఆమె పోస్టర్‌ను ఎఫ్‌బీఐ వెబ్‌సైట్‌లోని మోస్ట్ వాంటెడ్ పేజీలో కిడ్నాప్‌లు/తప్పిపోయిన వ్యక్తులు వ‌ర్గంలో పెట్టింది. మ‌యూషి చివరిసారిగా 2019 ఏప్రిల్ 29న న్యూజెర్సీలోని జెర్సీ సిటీలో ఉన్న తన అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వ‌స్తూ క‌నిపించింది. నాడు ఆమె రంగురంగుల పైజామా, నల్లటి టీ-షర్టు ధరించి కనిపించింది. ఆమె 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, నల్లటి జుట్టు, గోధుమ కండ్ల‌లో ఉంటుంద‌ని ఎఫ్‌బీఐ తెలిపింది.


మ‌యూషి స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చారని, న్యూ హాంప్‌షైర్ యూనివర్సిటీలో, ఆ తర్వాత న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌వైఐటీ)లో చ‌దువుతున్న క్ర‌మంలో క‌నిపించ‌కుండా పోయిన‌ట్టు వెల్ల‌డించింది. మ‌యూషి అదృశ్యం చాలా కాలంగా పెండింగ్ ఉండ‌టం, ఈ కేసులో ఇప్పటివరకు ఎటువంటి లీడ్ దొర‌క్క‌పోవ‌డంతో చివ‌రి ఎఫ్‌బీఐ ప్ర‌జ‌ల స‌హాయం కోరుతున్న‌ది.