Space Travel | అంతరిక్షయానంలో మరో రికార్డు.. తొలిసారి కలిసి ప్రయాణించిన తల్లీ కూతుళ్లు
Space Travel | అంతరిక్షయాన (Space Travel) చరిత్రలో మరో రికార్డు నమోదుకానుంది. స్పేస్‌లోకి ఒకేసారి వెళుతున్న తల్లీ కూతుళ్లుగా కరేబియన్‌కు చెందిన 18 ఏళ్ల అనాస్టాషియా మేయర్స్, ఆమె తల్లి కెయిషా స్కాహఫ్ నిలువనున్నారు. ఈ నెల 10న నింగిలోకి దూసుకెళ్లనున్న వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) 02 రాకెట్‌లో వీరు ప్రయాణించనున్నారు. అయితే ఇది పూర్తిగా పర్యాటక, వాణిజ్యపరమైన ప్రయోగం మాత్రమే. కొద్ది రోజుల క్రితం ఆంటిగ్వా నుంచి యూకేకు వర్జిన్ అట్లాంటిక్ విమానంలో […]

Space Travel |
అంతరిక్షయాన (Space Travel) చరిత్రలో మరో రికార్డు నమోదుకానుంది. స్పేస్‌లోకి ఒకేసారి వెళుతున్న తల్లీ కూతుళ్లుగా కరేబియన్‌కు చెందిన 18 ఏళ్ల అనాస్టాషియా మేయర్స్, ఆమె తల్లి కెయిషా స్కాహఫ్ నిలువనున్నారు. ఈ నెల 10న నింగిలోకి దూసుకెళ్లనున్న వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) 02 రాకెట్‌లో వీరు ప్రయాణించనున్నారు. అయితే ఇది పూర్తిగా పర్యాటక, వాణిజ్యపరమైన ప్రయోగం మాత్రమే.
కొద్ది రోజుల క్రితం ఆంటిగ్వా నుంచి యూకేకు వర్జిన్ అట్లాంటిక్ విమానంలో వస్తున్న కెయిషాకు ఒక ప్రకటన కనపడింది. తాము తీసే డ్రాలో గెలిస్తే రానున్న వర్జిన్ గెలాక్టిక్ లో ఉచితంగా అంతరిక్షంలోకి పంపుతామని అందులో ఉంది. ఏదో యథాలాపంగా ఆమె ఈ పోటీకి రిజిస్టర్ అయింది. కొన్ని నెలల తర్వాత హఠాత్తుగా ఆమెకు ఫోన్ రాగా.. టాప్ 20 లిస్టులో మీ పేరు ఉందని సంస్థ సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత మరి కొద్ది రోజులకు టాప్ 5లో ఉన్నారని.. తర్వాత మీరే విజేతగా నిలిచారని చెప్పారు.
దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఈ యాత్రకు ఆమెతో పాటు మరొకరిని తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ‘అమ్మా నువ్వు అంతరిక్షంలోకి వెళితే నీతో పాటు నేనుండాల్సిందే’ అని తన కుమార్తె మేయర్స్ పట్టుబట్టడంతో తన పేరును వర్జిన్ గెలాక్టిక్ సిబ్బందికి ఇచ్చింది. ఇలా వీరిద్దరూ గురువారం అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తల్లీ కూతుళ్లుగా రికార్డులకెక్కనున్నారు.
అయితే తాను కరేబియన్ నుంచి యూకే వచ్చి ఇక్కడి యూనివర్సిటీలో చదవడమే దీనికి కారణమని భావిస్తున్నట్లు మేయర్స్ అభిప్రాయపడింది. ఆమె ప్రస్తుతం అబెర్‌డన్ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ, ఫిజిక్స్ చదువుతోంది. ‘బయట ఎంతో మంది అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటున్నారు. వారందరికీ కాకుండా నాకు ఈ అవకాశం వచ్చిందంటే ఎంతో ఆనందంగా ఉంది’ అని సంతోషంతో చెప్పుకొచ్చింది.
వర్జిన్ గెలాక్టిక్ 02 గురువారం ఉదయం న్యూ మెక్సికో నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. జూన్‌లో ఇది ఒక సారి ప్రయాణించగా ఇది రెండో యాత్ర. ఈ ఇద్దరు తల్లీకూతుళ్లతో పాటు ఈ ప్రయాణంలో మాజీ ఒలింపిక్ నావికుడు జాన్ గుడ్‌విన్ కూడా ఉండనున్నాడు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ అంతరిక్షంలోకి వెళ్లనున్న రెండో వ్యక్తిగా ఆయన కూడా ఓ రికార్డు నెలకొల్పనున్నారు.
నాసా, యూఎస్ ఎయిర్‌ఫోర్స్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. 80 కి.మీ. అంతకంటే ఎక్కువ ఎత్తుకు ప్రయాణించిన వారిని ఆస్ట్రోనాట్‌లుగానే పరిగణించాలి. వర్జిన్ గెలాక్టిక్ 02 సుమారు 85 కి.మీ. ఎత్తుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వీరంతా ఆస్ట్రోనాట్‌ల జాబితాలో చేరనున్నారు. ఈ అంతరిక్ష పర్యాటకానికి వర్జిన్ గెలాక్టిక్ ఒక్కొక్కరికి రూ.2 కోట్ల నుంచి 3.57 కోట్ల వరకు వసూలు చేస్తోంది. సంవత్సరానికి సుమారు 400 ట్రిప్పులు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.