నిండా మునుగుతున్నఅదానీ గ్రూప్ మ‌దుప‌రులు

7 రోజుల్లో రూ.10 ల‌క్ష‌ల కోట్లు కరిగిపోయిన సంప‌ద‌ హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో కుప్పకూలుతున్న అదానీ షేర్లు హర్షద్‌, సత్యంలను తలదన్నేలా కుంభకోణం విధాత‌: అదానీ గ్రూప్ సంస్థ‌ల షేర్లు కొన్న మ‌దుప‌రులు ల‌బోదిబోమంటున్నారు. వారం రోజుల్లో ఏకంగా రూ.10 ల‌క్ష‌ల కోట్ల (120 బిలియ‌న్ డాల‌ర్లపైనే) న‌ష్టాల‌ను చ‌విచూశారు. హిండెన్‌బర్గ్‌ రిపోర్టుతో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో అదానీ గ్రూప్ షేర్లు కుప్ప‌కూలుతున్న విష‌యం తెలిసిందే. షేర్‌ మార్కెట్‌ను అతలాకుతలం చేసిన ఒకప్పటి హర్షద్‌మెహతా ఉదంతం, కంపెనీకి లేని […]

  • Publish Date - February 5, 2023 / 12:02 AM IST

  • 7 రోజుల్లో రూ.10 ల‌క్ష‌ల కోట్లు కరిగిపోయిన సంప‌ద‌
  • హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో కుప్పకూలుతున్న అదానీ షేర్లు
  • హర్షద్‌, సత్యంలను తలదన్నేలా కుంభకోణం

విధాత‌: అదానీ గ్రూప్ సంస్థ‌ల షేర్లు కొన్న మ‌దుప‌రులు ల‌బోదిబోమంటున్నారు. వారం రోజుల్లో ఏకంగా రూ.10 ల‌క్ష‌ల కోట్ల (120 బిలియ‌న్ డాల‌ర్లపైనే) న‌ష్టాల‌ను చ‌విచూశారు. హిండెన్‌బర్గ్‌ రిపోర్టుతో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో అదానీ గ్రూప్ షేర్లు కుప్ప‌కూలుతున్న విష‌యం తెలిసిందే. షేర్‌ మార్కెట్‌ను అతలాకుతలం చేసిన ఒకప్పటి హర్షద్‌మెహతా ఉదంతం, కంపెనీకి లేని లాభాలు చూపించి.. కంపెనీ విలువను పెంచేసిన సత్యం రామలింగరాజు ఉదంతాలను తలదన్నేలా తాజాగా అదానీ కుంభకోణం నిలిచింది. సర్క్యులర్‌ ట్రేడింగ్, రౌండ్‌ ట్రిప్పింగ్‌ విధానాలతో కంపెనీ షేరు విలువను భారీగా పెంచేసిన అదానీ ఇప్పడు మదుపరుల సంపదతో ఆటలాడుకున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అదానీ గ్రూప్‌న‌కు చెందిన 10 కంపెనీలు భార‌తీయ స్టాక్ మార్కెట్ల‌లో న‌మోద‌య్యాయి. ఇప్పుడు ఈ సంస్థ‌ల షేర్ల‌న్నీ కూడా నేల‌చూపులే చూస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల్లో మ‌దుపు చేసిన ఇన్వెస్ట‌ర్లు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

గ‌త మంగ‌ళ‌వారం (జ‌న‌వ‌రి 24న‌) హిండెన్‌బర్గ్‌ నివేదిక విడులైన విష‌యం తెలిసిందే. ఆ మరుస‌టి రోజు నుంచే అదానీ గ్రూప్ షేర్ల న‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టిదాకా జ‌రిగిన 7 ట్రేడింగ్ సేష‌న్ల‌లో అదానీ గ్రూప్‌లోని 10 సంస్థ‌ల మార్కెట్ విలువ దాదాపు రూ.10 ల‌క్ష‌ల కోట్లు క‌రిగిపోయింది.

ఎల్ఐసీ, ఎస్బీఐల‌కూ ఎఫెక్ట్‌

అదానీ గ్రూప్ న‌ష్టాలు రిటైల్ మ‌దుప‌రుల‌కేగాక.. ఎల్ఐసీ త‌దిత‌ర‌ సంస్థాగ‌త మదుప‌రుల‌ను, రుణాలిచ్చిన ఎస్బీఐ వంటి బ్యాంకుల‌నూ ముంచుతున్నాయి. అదానీ గ్రూప్ రుణ భారం రూ.2.31 ల‌క్ష‌ల కోట్ల‌పైనేన‌ని చెప్తున్నారు. ఇందులో దేశీయ బ్యాంకుల వాటా భారీగానే ఉంటుంద‌ని అంచ‌నా. ఇప్ప‌టికే ఆర్బీఐ.. అదానీకిచ్చిన అప్పుల వివ‌రాల‌ను అంద‌జేయాల‌ని బ్యాంకుల‌ను ఆదేశించింది.

అధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఎస్బీఐకి అదానీ గ్రూప్ బాకీలు రూ.27,000 కోట్లుగా ఉంటే.. అదానీ సంస్థ‌ల్లో ఎల్ఐసీ పెట్టుబ‌డులు రూ.56,000 కోట్ల‌పైనే. అయితే గ‌త వారం రోజుల్లో అదానీ షేర్ల న‌ష్టాల‌తో ఎల్ఐసీ పెట్టుబ‌డుల విలువ దాదాపు స‌గానికి ప‌డిపోవ‌చ్చ‌న్న అంచ‌నాలు మార్కెట్ వ‌ర్గాల్లో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

గుడ్డిగా పెట్టుబ‌డులు పెడితే ఎలా..

ఎల్ఐసీ అంటే.. దేశంలోని స‌గ‌టు మ‌నిషి బీమా ధీమా. అలాంటి ఈ సంస్థ పెట్టుబ‌డుల్లో ప్ర‌భుత్వ జోక్యం త‌గ్గాల‌న్న అభిప్రాయాలు ఇప్పుడు అంత‌టా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబ‌డుల వెనుక ప్ర‌భుత్వ పెద్దల ఒత్తిడి ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దీంతో ఇలా గుడ్డిగా పెట్టుబ‌డులు పెడుతూ పోతే.. పాల‌సీదారుల సొమ్మే ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని, పైపెచ్చు ఎల్ఐసీపై న‌మ్మ‌కం కూడా పోతుందని, ఇదంత శ‌భ‌ప‌రిణామం కాదన్న ఆందోళ‌న‌లు స‌ర్వ‌త్రా క‌నిపిస్తున్నాయిప్పుడు. ఇక అదానీ గ్రూప్ షేర్ల న‌ష్టాలు ఇలాగే కొన‌సాగి, ఆ సంస్థకిచ్చిన ఎస్బీఐ రుణాలు కూడా రిస్కులో ప‌డే వీలుంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

హిండెన్ బ‌ర్గ్ రిపోర్టు విడుద‌లైన నాటి నుంచి అదానీ గ్రూప్‌లోని ఏ షేర్‌కు ఎంత న‌ష్టం

సంస్థ జ‌న‌వ‌రి 24న షేర్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి 3న షేర్ ధ‌ర న‌ష్టం

అదానీ టోట‌ల్ గ్యాస్ రూ.3,891.75 రూ.1,622.35 రూ.2,269.4
అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ రూ.3,442 రూ.1,531 రూ.1,911
అదానీ ట్రాన్స్‌మిష‌న్ రూ.2,762.15 రూ.1,396.05 రూ.1,366.1
ఏసీసీ రూ.2,335.7 రూ.1,920 రూ.415.7
అదానీ గ్రీన్ ఎన‌ర్జీ రూ.1,916.8 రూ.935.9 రూ.980.9
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ రూ.761.2 రూ.488.4 రూ.272.8
అదానీ విల్మ‌ర్ రూ.572.65 రూ.399.95 రూ.172.7
అంబుజా సిమెంట్ రూ.498.95 రూ.372.15 రూ.126.8
ఎన్‌డీటీవీ రూ.284 రూ.212.75 రూ.71.25
అదానీ ప‌వ‌ర్ రూ.274.65 రూ.191.95 రూ.82.7

అదానీ కంపెనీల‌పై స్టాక్ ఎక్స్చేంజీల నిఘా

అదానీ గ్రూప్ షేర్ల వ‌రుస న‌ష్టాల మ‌ధ్య స్టాక్ ఎక్స్చేంజీలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్‌తోపాటు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌, అంబుజా సిమెంట్స్ కంపెనీల‌ను అటు నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) , ఇటు బాంబే స్టాక్ ఎక్స్చేంజీ (బీఎస్ఈ)లు త‌మ స్వ‌ల్ప‌కాలిక అద‌న‌పు నిఘా వ్య‌వ‌స్థ (ఏఎస్ఎం) కింద‌కు తెచ్చాయి.

దీంతో ట్రేడింగ్ స‌మ‌యంలో ఈ మూడు సంస్థ‌ల క్ల‌యింట్ల లావాదేవీలు, స్టాక్స్ విలువ‌ల్లో హెచ్చుత‌గ్గుల తీరు వంటి అంశాల‌పై నిఘా పెర‌గ‌నున్న‌ది. గ‌డిచిన వారం రోజుల ట్రేడింగ్‌లో అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ షేర్ విలువ దాదాపు 60 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్ విలువ 35 శాతం, అంబుజా సిమెంట్స్ షేర్ విలువ సుమారు 28 శాతం మేర ప‌డిపోయింది.

Latest News