Janasena
విధాత: టీడీపీతో పొత్తులు, సీట్లు ఇవన్నీ ఖరారు కావడానికి ఇంకా టైం ఉంది. ఎవరికీ ఎన్ని సీట్లు.. ఎక్కడ పోటీ చేస్తారు.. ఎన్ని గెలుస్తారు అన్నది మున్ముందు తెలుస్తుంది కానీ, ప్రస్తుతానికి జనసేనకు సంతోషం కలిగించే వార్త వచ్చింది. పార్టీ స్థాపించి పదేళ్లవుతున్నా ఇంకా ఒక పర్మినెంట్ గుర్తుకే దిక్కులేదని ప్రత్యర్థి పార్టీలు వెక్కిరిస్తున్నాయి.
ఈ తరుణంలో జనసేనకు కాస్త సంతోషం కలిగించేలా మంచి కబురు అందింది.కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్‌ను కేటాయించింది. దీంతో ఈసీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇందులో భాగంగా.. “జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి విదితమే” అని తెలిపారు. ఈమేరకు లేఖను, ప్రకటనను ట్వీట్ చేశారు.
గ్లాస్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు – JanaSena Chief Shri @PawanKalyan #VoteForGlass pic.twitter.com/yxWjWbbAXp
— JanaSena Party (@JanaSenaParty) September 19, 2023
వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఏపిలో 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం” అని పవన్ పేర్కొన్నారు.
అనంతరం “ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు యావన్మంది సిబ్బందికి పేరుపేరునా నా తరపున, జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్.. ఏపీతోపాటు తెలంగాణ రాజకీయాఎల్లో సైతం పోటీ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు.
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు “గాజు గ్లాస్”
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు “గాజు గ్లాసు” ను మరోసారి కేటాయించిన ఎన్నికల సంఘం
గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం – జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం.#VoteForGlass pic.twitter.com/BG83kvIxQo
— JanaSena Party (@JanaSenaParty) September 19, 2023
వాస్తవానికి.. మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించింది. గత ఎన్నికల్లో, అర్హత మేరకు ఓట్లు సాధించని కారణంతో ఈసీ గాజు గుర్తును ఫ్రీ సింబల్ గా పేర్కొంది. అప్పుడు దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన పార్టీ గుర్తింపును, గ్లాస్ గుర్తును సైతం కోల్పోయింది. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే గుర్తును జనసేనకు కేటాయించింది.
ఇదిలా ఉండగా చంద్రబాబు జైల్లో ఉన్న తరుణంలో పవన్ దూకుడు పెంచారు. జగన్ మీద కామెంట్స్ దాడి తీవ్రత పెంచారు. ఇక చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తాను .. టిడిపితో పొత్తు ఉంటుందని ప్రకటించి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. పొత్తుల అంశం తేల్చేందుకు నాదెండ్ల మనోహర్ సారథ్యంలో కమిటీ కూడా వేశారు.