గ్రూప్‌-1 పరీక్షల నియామకాలు..TGPSC పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • By: sr    latest    Apr 28, 2025 6:00 PM IST
గ్రూప్‌-1 పరీక్షల నియామకాలు..TGPSC పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

విధాత : గ్రూప్‌-1 పరీక్షల నియామకాలపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం హైకోర్టు సీజే ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. గ్రూప్‌-1లో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని పిటిషనర్లు ఆరోపించారు. గ్రూప్‌-1 మెయిన్స్‌లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ విచారణ జరిపింది. విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు జారీ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను కొనసాగించవచ్చని చెప్పింది.

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. జులై 7న ఫలితాలు విడుదల చేసింది. అనంతరం అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు టీఎస్‌పీఎస్సీ మెయిన్స్ నిర్వహించింది. పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించి.. సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టింది. మూల్యాంకనం అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో సింగిల్‌ బెంచ్‌ జడ్జి గత వారం నియామకాలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను టీజీపీఎస్పీ సవాల్‌ చేసింది.