మతం మారే హిందువులకు ముందస్తు అనుమతి అవసరం

  • Publish Date - April 11, 2024 / 03:51 PM IST

  • సర్క్యులర్ జారీ చేసిన గుజరాత్ ప్రభుత్వం

న్యూఢిల్లీ: బౌద్ధమతం ప్రత్యేక మతంగా పరిగణించబడుతుందని, అందువల్ల ఎవరైనా హిందూ మతం నుండి బౌద్ధ, జైన, సిక్కు మతాల్లోకి మారితే గుజరాత్ మత స్వేచ్ఛ చట్టంనిర్వచించిన ప్రకారం స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ నుండి అనుమతి పొందాలని గుజరాత్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది.

“బౌద్ధమతంలోకి మారాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత” గుజరాత్ హోం శాఖ మార్చి 8న ఈ సర్క్యులర్ను జారీ చేసింది.ప్రతి సంవత్సరం, దసరా వంటి పండుగలలో దళితులు బౌద్ధమతంలోకి సామూహికంగా మారడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది.

“ హిందూ మతం నుండి బౌద్ధమతంలోకి మారడానికి అనుమతి కోరుతూ వచ్చిన దరఖాస్తుల్లో, అధికారులు నిబంధనల ప్రకారం పాటించాల్సిన విధానాన్ని అనుసరించడం లేదని తేలింది. అంతేకాకుండా, కొన్నిసార్లు, హిందూ మతం నుండి బౌద్ధమతంలోకి, మత మార్పిడికి ముందస్తు అనుమతి అవసరం లేదని దరఖాస్తుదారులు, ఎన్టీవో సంస్థల నుండి వివరణలు అందుతున్నాయి,” అని ఈ సర్క్యులర్ పేర్కొంది. “చట్టపరమైన నిబంధనలను తగినంతగా అధ్యయనం చేయకుండా మత మార్పిడి వంటి సున్నితమైన అంశంలో దరఖాస్తుదారులకు ఇచ్చిన ప్రత్యుత్తరాలు న్యాయపరమైన వ్యాజ్యాలకు దారితీసే అవకాశం ఉంది” అని సర్క్యులర్ పేర్కొంది.

ఈ విషయంపై గుజరాత్ హోం శాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఈ సర్క్యులర్ను మతమార్పిడి విషయంలో మరింత స్పష్టత కోసం జారీ చేసినట్లు చెప్పారు. “కొందరు జిల్లా మేజిస్ట్రేట్లు హిందూ మతం నుండి బౌద్ధమతంలోకి మత మార్పిడికి సంబంధించిన దరఖాస్తులను నిర్ణయించేటప్పుడు చట్టం, దాని నియమాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. అలాగే, కొంతమంది జిల్లా మేజిస్ట్రేట్లు ఈ అంశంపై సరైన వైఖరి చెప్పాలని కోరారు. కాబట్టి, మేము ఈ సర్క్యులర్ను మరింత స్పష్టత కోసం జారీ చేసాము, ”అని అధికారి తెలిపారు.

బౌద్ధం-హిందూమతం ఒకటి కాదని సర్క్యులర్తో స్పష్టమైంది- బౌద్ధ అకాడమీ

ఈ సర్క్యులర్పై గుజరాత్ బౌద్ధ అకాడమీ కార్యదర్శి రమేష్ బ్యాంకర్ స్పందించారు, “ఈ సర్క్యులర్ బౌద్ధమతం ప్రత్యేక మతమని, దీనికి హిందూ మతంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. బౌద్ధమతం హిందూమతంలో భాగం కాదని, బౌద్ధమతంలోకి మారాలంటే నిర్ణీత ఫార్మాట్లో జిల్లా మేజిస్ట్రేట్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని మేము మొదటి నుండి నమ్ముతున్నాము. ఈ సర్క్యులర్ జారీ చేయడం వల్ల మా డిమాండ్ నెరవేరింది” అని చెప్పుకొచ్చారు.

Latest News