Heron Mork-2 | ఒక్క సారి గాల్లోకి లేస్తే.. పాక్, చైనా సరిహద్దుల్ని జల్లెడ పట్టేస్తాయి హెరోన్ డ్రోన్లను మోహరించిన వాయుసేన
Heron Mork-2 | భారత్ సరిహద్దులను డేగ కళ్లతో కాపు కాసే క్రమంలో వాయుసేన కీలక ముందడుగు వేసింది. క్షిపణులను అనుసంధానం చేసిన నాలుగు హెరోన్ మార్క్ 2 డ్రోన్లను నార్తన్ సెక్టార్‌లో మోహరించింది. ఇవి ఒక్క సారి గాల్లోకి లేస్తే.. మొత్తం పాక్ నుంచి చైనా సరిహద్దు చివరి వరకు జల్లెడ పట్టి వెనక్కు వస్తాయి. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఆ ఇంధనంతో ఇవి 36 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని అధికారులు […]

భారత్ సరిహద్దులను డేగ కళ్లతో కాపు కాసే క్రమంలో వాయుసేన కీలక ముందడుగు వేసింది. క్షిపణులను అనుసంధానం చేసిన నాలుగు హెరోన్ మార్క్ 2 డ్రోన్లను నార్తన్ సెక్టార్‌లో మోహరించింది. ఇవి ఒక్క సారి గాల్లోకి లేస్తే.. మొత్తం పాక్ నుంచి చైనా సరిహద్దు చివరి వరకు జల్లెడ పట్టి వెనక్కు వస్తాయి. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఆ ఇంధనంతో ఇవి 36 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని అధికారులు తెలిపారు.
అంతే కాకుండా హెరోన్ డ్రోన్లు క్షిపణులను, ఇతర ఆయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శత్రు దేశాల విమానాలపై బాగా దూరం నుంచే లేజర్ కిరణాన్ని ప్రసరించడం ద్వారా మన యుద్ధ విమానాలు వాటిపై దాడి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
వీటిని ఒకే చోట ఉండి.. దేశ సరిహద్దుల వద్ద, అంతర్గత ప్రదేశాల వద్దకు ఎక్కడికైనా వెళ్లేలా.. తిరిగి వచ్చేలా నియంత్రించవచ్చు. ముఖ్యంగా అంతర్గతంగా మూకదాడులు జరిగినపుడు, మత ఘర్షణలు తలెత్తినపుడు అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి.
సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నా.. 60 డిగ్రీలతో ఎండలు మండిపోతున్నా.. దీని పనితీరులో మార్పు ఉండదని హెరోన్ మార్క్ 2 డ్రోన్ పైలట్ అర్పిత్ టాండన్ పేర్కొన్నారు. అభివృద్ధి పరిచిన ఇంజిన్లు, ఆధునిక రూపం వల్ల ఎలాంటి భూ భాగంపైనైనా ఇవి పనిచేస్తాయి.