నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద గురువారం హైటెన్షన్ నెలకుంది. ప్రాజెక్టు 26 గేట్లలో చెరి 13 గేట్ల వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు పహారా కాస్తున్నారు.

- 26 గేట్లలో చెరి 13 గేట్ల వద్ద పోలీసుల పహారా
- ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని బందోబస్తు
- ఏపీ వైపు వాహనాలు రాకుండా అడ్డుకుంటున్న ఏపీ పోలీసులు
- తాత్కాలిక విద్యుత్ తో దౌర్జన్యంగా కుడి కాల్వకు
- నీటి విడుదల చేసుకున్న ఏపీ అధికారులు
విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద గురువారం హైటెన్షన్ నెలకుంది. ప్రాజెక్టు 26 గేట్లలో చెరి 13 గేట్ల వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు పహారా కాస్తున్నారు. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని అక్కడే బందోబస్తు చేపట్టారు. ఏపీ వైపు వాహనాలు రాకుండా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. తాత్కాలిక విద్యుత్ తో ఏపీ అధికారులు దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటి విడుదల చేసుకున్నారని తెలంగాణ యంత్రాంగం ఆరోపిస్తోంది. కాగా నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరామని ఆంధ్ర అధికారులు చెబుతున్నారు.
ఈక్రమంలోనే సెక్యూరిటీ కల్పించడానికి సాగర్ డ్యామ్‌పై వెళ్లడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు. సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గేటుకు సంబంధించిన సెన్సార్ పగిలిపోయింది. కాగా 5 వ గేటు ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఆయకట్టు రైతాంగం ఆందోళనలో పడింది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత సృష్టించేందుకు ఏపీ ప్రభుత్వ పన్నాగం పన్నుతోందని, బలవంతంగా సాగు నీరు ఏపీకి తరలించేందుకు ప్రయత్నించి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ప్రణాళిక రూపొంచిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఓటర్లను కేసీఆర్ వైపు మళ్లించే ఎత్తుగడగా ప్రతిపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రాజెక్టు వద్దకు జగన్ సర్కార్ భారీగా పోలీసు బలగాలు తరలించింది. తెలంగాణ ఎస్ పీఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్ పీఎఫ్ అర్ఐ భాస్కర్ తెలిపారు.
ఇన్ని రోజులు లేని హడావుడి.. పోలింగ్ రోజే ఎందుకు?: కోమటిరెడ్డి
సాగర్ డ్యామ్‌పై పోలీసుల హడావుడిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సాగర్ డ్యామ్‌పై పోలీసుల డ్రామా కేసీఆర్ పనేనన్నారు. ఓడిపోతున్నారని కేసీఆర్‌కు అర్థమై తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.
నీటి పంపకాల్లో రాజీ పడే ప్రసక్తే లేదు: మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ ప్రజలు తమ హక్కు వదులుకోవడానికి సిద్ధంగా లేరని, నీటి పంపకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సాగర్ వివాదంపై సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి, సాగర్ నీటి విషయంలో మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ మొండిగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల్లో కృష్ణా నీటి సమస్య కొనసాగుతున్నదని అన్నారు. కేంద్రం కృష్ణా నీటి పంపకాల్లో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే సమస్య వస్తున్నదన్నారు. ఆంధ్రప్రదేశ్ మొండి వైఖరితో తొండి చేస్తోందని విమర్శించారు.
ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా నుండి ఒక్క చుక్క కూడా పోనీయం అని తెగేసి చెప్పారు. సాగు, తాగు నీటి కోసం మేమంతా సాగర్ పై ఆధారపడి ఉన్నామన్నారు. కోట్లాది మంది ప్రజల జీవితాలతో చెలాగాటమాడే పద్ధతిలో ఆంధ్ర వ్యవహారం సరైందికాదన్న మంత్రి, ఆంధ్ర తీరు సహించబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ ఉన్నంత కాలం మా హక్కుల్ని హరించడం ఎవరివల్ల కాదన్నారు. నీటి వివాదం అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయం చేసే అలవాటు మాకు లేదన్నారు.
