Chiranjeevi | విధాత, సినిమా: టాలీవుడ్లో రీసెంట్గా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘బేబీ’. విడుదలై రెండు వారాలు అవుతున్నా.. ‘బేబీ’ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై.. యూనిట్‌కు షీల్డ్‌లను అందించారు. ఈ సినిమా తన హృదయాన్ని తాకిందని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఇంకా మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘‘నేను బేబీ సినిమా విజయోత్సవ సభకు […]
Chiranjeevi |
విధాత, సినిమా: టాలీవుడ్లో రీసెంట్గా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘బేబీ’. విడుదలై రెండు వారాలు అవుతున్నా.. ‘బేబీ’ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై.. యూనిట్‌కు షీల్డ్‌లను అందించారు. ఈ సినిమా తన హృదయాన్ని తాకిందని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఇంకా మెగాస్టార్ మాట్లాడుతూ..
‘‘నేను బేబీ సినిమా విజయోత్సవ సభకు వచ్చానా.. లేక నా సన్మాన సభకు వచ్చానా అనేది అర్థం కావడం లేదు. నన్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ వాళ్ల మనసులో మాటను నాకు చెబుతున్న నా అభిమానులందరికీ నా ధన్యవాదాలు. పుత్రోత్సాహం ఎలా ఉంటుందో.. ఇప్పుడు అనుభవిస్తున్నాను. అలాగే తమ్ముళ్ల అభివృద్ధిని చూసి ఆనందిస్తున్నాను.
అలాగే నా మేనల్లుళ్లు, మిత్రులు నాతో పాటు ఎదుగుతూ విజయాలు పొందుతుంటే సంతోషపడుతున్న నాకు.. దేవుడు ఇచ్చిన తమ్ముళ్లైన అభిమానులు.. నన్ను స్ఫూర్తిగా తీసుకుని.. మనం కూడా సాధించవచ్చని తమకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసి.. సక్సెస్ అందుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అందుకు ఉదాహరణే ఈ బేబీ ఫంక్షన్.
ఈ ‘బేబీ’ చిత్ర నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్లను నేను తరుచూ కలవకున్నా.. వాళ్లు చేసే సినిమా ప్రయత్నాల గురించి వింటూనే ఉంటాను. అభిమానులు అంటే థియేటర్లో సినిమా చూసే దగ్గరే ఆగిపోవడం కాదు.. ఇలా మమ్మల్ని, మా సినిమాల్ని చూసి పొందిన స్పూర్తి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చా ఇలా తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ విజయాలు సాధిస్తున్నారంటే అందుకు నాకంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు.
హీరోల అభిమానులంటే ఒక లక్ష్యం లేకుండా తిరుగుతారు, చదువుల మీద శ్రద్ధ పెట్టరు. మరో హీరో అభిమానులతో గొడవలు పడతారు అనే రోజుల నుంచీ నాకు తెలుసు. అవి నా చెవిన పడిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుడే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టి నా అభిమానులంటే సమాజం గర్వించేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. మారుతి, సాయిరాజేష్, ఎస్కేఎన్ వంటి నా ఫ్యాన్స్ కలిసి చేసిన సినిమా ఘన విజయం సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వాళ్ల సంతోషంలో నేనూ ఒక భాగమవ్వాలని ఈ కార్యక్రమానికి వచ్చాను.
మారుతి సాఫ్ట్ వేర్ కంపెనీకి పనిచేస్తుంటే.. ఒక రోజు ఒక పాట ఆడియో ఇచ్చి దీనికి విజువల్స్ తీసుకుని రా అని చెప్పాను. అది పర్సనల్ వీడియో. అతను వెళ్లి మంచి విజువల్స్ తెచ్చాడు. అప్పుడే అనిపించింది ఇతనిలో డైరెక్టర్ ఉన్నాడని, ఆ మాటే మారుతికి చెప్పాను. నా మాట నమ్మాడు. ఇవాళ పాన్ ఇండియా స్టార్‌తో సినిమా చేసే దర్శకుడు అయ్యాడు.
ఎస్కేఎన్ ఏలూరులో నా సినిమా బ్యానర్స్ కట్టే అభిమాని టైమ్ నుంచి తెలుసు. గీతా ఆర్ట్స్‌లో అరవింద్ గారు, బన్నీ సపోర్ట్‌తో ప్రొడక్షన్ విషయాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ‘ఈ రోజుల్లో, టాక్సీవాలా’.. ఇప్పుడు ‘బేబీ’ మూవీ ప్రొడ్యూస్ చేశాడు. నా అభిమానిగా అతని ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉంది.
ఇవాళ SKN ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. అతని స్పీచ్‌లు కూడా ఈ మధ్య కొన్ని విన్నాను. సాయి రాజేష్ మొదట్లో స్పూఫ్ సినిమాలు చేశాడు. హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి చిత్రాలు. కానీ ‘కలర్ ఫొటో’తో కథా రచయితగా తన సత్తా చాటి.. జాతీయ అవార్డ్ గెల్చుకున్నాడు. ఇవాళ ‘బేబీ’ మూవీతో ఒక కాంటెంపరరీ మూవీ చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. అతను నా అభిమాని కావడం గర్వంగా ఉంది.
ఇండస్ట్రీలోకి కొత్త తరం రావాలి, కొత్త ఆలోచనలు కావాలి. అప్పుడే ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. రాజమౌళి లాంటి దర్శకులు ఉన్నారు కాబట్టే ఆస్కార్ వరకు తెలుగు సినిమాలు వెళ్లగలుగుతున్నాయి. కొత్త దర్శకులు ఇండస్ట్రీ అభివృద్ధిలో భాగమైతే.. అదే మీరు చేసే ప్రత్యుపకారం అనుకోవాలి.
ఆనంద్ గతంలో చేసిన ఒక సినిమా చూశాను. ఇప్పుడు ‘బేబీ’ చూస్తుంటే నటుడిగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఎంతో పరిణితి చెందాడని అనిపించింది. బస్తీ కుర్రాడిగా సహజంగా నటిస్తూ వచ్చాడు. ఒక సీన్లో అతను పలికించిన భావోద్వేగాలు చూసి ఇంత బాగా ఆనంద్ నటించగలడా.. వావ్ అనిపించింది. ఆనంద్‌లో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు. ప్రతి సీన్ అతను ఫీల్ అయి చేస్తాడు. ఆ ఫీల్ మనకు అతని ఫేస్‌లో కనిపిస్తుంటుంది. బేబీ సినిమాలో ఆనంద్ నటనను కాదు హృదయాన్ని చూశాను.
విరాజ్ అశ్విన్ చక్కగా నటించారు. లవ్ స్టోరిస్ చాలా చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో అందరూ మంచి వాళ్లే. విలన్ లేకుండా ఇంత బాగా చూపించగలి గారు అంటే సర్ ప్రైజ్ అయ్యాను. వైష్ణవి మానసిక సంఘర్షణ ఆకట్టుకునేలా చూపించారు. ఆ స్ట్రగుల్ సినిమాను నిలబెట్టింది. బస్తీలో అమాయకపు అమ్మాయిగా, కాలేజ్‌లో ట్రెండీ మేకోవర్‌లోకి మారే యువతిగా వైష్ణవి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. సినిమా చూస్తున్నంత సేపూ చాలా సార్లు వైష్ణవి ఎంత మెచ్యూర్డ్‌గా నటించిందని అనిపించింది.
విరాజ్ మన సినిమా ఫ్యామిలీ కుర్రాడే. ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు. ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చాడు అనిపించింది. మనం ఎంత కష్టపడితే అంత గొప్పగా మనల్ని నిలబెట్టే పరిశ్రమ ఇదే. విరాజ్ చాలా అందంగా కనిపించాడు. విరాజ్ అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తాడని అనుకుంటాం కానీ అతను నిజంగా ప్రేమించాడు. ఈ స్క్రిప్ట్ లోని గొప్పతనం అదే. అందరూ మంచి వాళ్లే. నిజమైన ప్రేమికుడిగా ఉండి అమ్మాయి ప్రేమ కోసం తపిస్తుంటాడు.
ఇది ఎడ్యుకేట్ చేసే సినిమా. మీరు వదిలినా మిమ్మల్ని ఈ కంటెంట్ వదలదు. రెండు మూడు రోజులు నేను ఈ సినిమా మూడ్‌లోనే ఉండిపోయాను. ఇవాళ చాలా మంది యువత సోషల్ మీడియా మాయలో పడి పోయి, ఎడిక్ట్ అయిపోతున్నారు. టెక్నాలజీకి కట్టుబడి పోతున్నారు. ఎక్కడో ఒక బలహీనమైన సమయంలో మాటో, తప్పు పనో చేస్తుంటారు. ఆ తప్పుల్ని క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిలింగ్స్ జరుగుతున్నా యి. ఆ తప్పులతో యువత సూసైడ్ దాకా వెళ్తున్నారు. అందుకే పెద్దలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి.
అందుకే టెక్నాలజీని మంచికే వాడుకోవాలని కోరుతున్నా. జీవితంలో తెలిసో తెలియకో ఒక తప్పుచేసినా బాధ పడుతూ కూర్చోకుండా ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఆశతో బతకాలనే గొప్ప సందేశాన్ని సాయిరాజేష్ ఈ సినిమాతో ఇచ్చాడు. నేను మరో కోణంలో క్లైమాక్స్ ఇస్తే బాగుండేదని సాయి రాజేష్‌కి చెప్పాను కానీ.. అతనే కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను. టీమ్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను..’’ అని ‘బేబీ’ సినిమా యూనిట్‌ను మెగాస్టార్ అభినందించారు.