Watermelon | పుచ్చకాయల్లో తియ్యనివి, లోపల ఎర్రగా ఉండేవి గుర్తించాలంటే
విధాత: అసలే ఎండాకాలం. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఎండలో తిరిగే జనం అల్లాడి పోతున్నారు. దాహార్తిని తీర్చుకోవడానికి కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు (Watermelon) తీసుకుంటుంటారు. అయితే.. పుచ్చకాయలు కొని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు అవి తియ్యగా ఉంటాయా? లోపల గుజ్జు ఎర్రగా ఉంటుందా? అనే సందేహాలు కలడం సహజం. అమ్మేవాళ్లు చెప్పే మాటలు నమ్మి కొనాల్సిందే. అయితే.. పుచ్చకాయలు తియ్యగా ఉంటాయో లేదో మనమే కనిపెట్టేయవచ్చు. వాటి లోపలి గుజ్జు ఎలా ఉంటుందో కూడా పసిగట్టవచ్చు. ఇది చాలా సింపుల్. […]

విధాత: అసలే ఎండాకాలం. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఎండలో తిరిగే జనం అల్లాడి పోతున్నారు. దాహార్తిని తీర్చుకోవడానికి కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు (Watermelon) తీసుకుంటుంటారు. అయితే.. పుచ్చకాయలు కొని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు అవి తియ్యగా ఉంటాయా? లోపల గుజ్జు ఎర్రగా ఉంటుందా? అనే సందేహాలు కలడం సహజం.
అమ్మేవాళ్లు చెప్పే మాటలు నమ్మి కొనాల్సిందే. అయితే.. పుచ్చకాయలు తియ్యగా ఉంటాయో లేదో మనమే కనిపెట్టేయవచ్చు. వాటి లోపలి గుజ్జు ఎలా ఉంటుందో కూడా పసిగట్టవచ్చు. ఇది చాలా సింపుల్.
ఎండాకాలంలో పుచ్చకాయలు ఎక్కడపడితే అక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు మంచివి, తియ్యగా ఉండేవి తీసుకోవచ్చు. అందుకు మూడు చిట్కాలు పాటిస్తే సరి. ఎందుకంటే పుచ్చకాయ రుచిని ఆస్వాదించాలంటే అవి తియ్యగా, జ్యూసీగా ఉండాల్సిందే. లేదంటే వాటిని తినడంలో ఎలాంటి మజా ఉండదు. అందుకోసమే టిప్పులు..
ఎర్రగా, తియ్యగా ఉండే పుచ్చకాయలు ఇలా గుర్తించవచ్చు..
సైజులో పెద్దగా, పసుపుపచ్చని మచ్చలు ఉన్నవి ఎంచుకోండి. నిగనిగలాడిపోతూ ఉండే పుచ్చకాయలు చూడగానే కొనాలనేంత టెంప్టింగ్‌గా ఉంటాయి. కానీ.. అవి కోసిన తర్వాత కానీ అసలు విషయం బయట పడదు. కాబట్టి మీరేం చేయాలంటే.. ముందుగా వీలున్నంత పెద్ద పుచ్చకాయలు ఎంచుకోండి.
ఎందుకంటే.. పుచ్చకాయలో 92శాతం నీరు ఉంటుంది. దాని వల్లే పుచ్చకాయ జ్యూసీగా ఉంటుంది. పెద్ద కాయ తీసుకుంటే ఎక్కువ నీరు ఉంటుంది. మీరు ఎంచుకున్న పెద్ద కాయల్లో లేతగా, మచ్చలు ఉన్నవేంటో చూడండి. పుచ్చకాయకు ఒక వైపున పసుపు పచ్చ రంగులో పెద్ద మచ్చ ఒకటి కనిపిస్తుంది.
అది ఉన్నదంటే పుచ్చకాయ బాగా పక్వానికి వచ్చినట్టు భావించవచ్చు. గుజ్జు ఎర్రగా ఉండేవి, తియ్యగా ఉండేవి గుర్తించడానికి మరో కిటుకు కూడా ఉన్నది. ఎంచుకున్న పుచ్చకా పైన చేతితో కొడితే మీకు లోతు నుంచి వినిపిస్తున్నట్టు శబ్దం వస్తుంది. బాగా పండిపోయినవి అయితే డొల్ల సౌండ్ వినిపిస్తుంది.
కల్తీలను గుర్తించండిలా..
గుజ్జు ఎర్రగా కనిపించేందుకు కొంతమంది రంగును ఇంజెక్ట్ చేస్తుంటారు. దానిని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. రంగును లోపలికి పంపేందుకు సిరంజీలను వాడుతారు. ఒకే చోట కాకుండా నాలుగైదు చోట్ల గుచ్చి రంగు పంపుతారు. మీరు కాయను నిశితంగా పరిశీలిస్తే సన్నని రంథ్రాలు కనిపిస్తాయి. అలాంటి కాయలను అసలు కొనుగోలు చేయవద్దు.