ఎన్నికల బరిలో బర్రెలక్క: కొల్లాపూర్‌లో నామినేషన్ దాఖలు

విధాత: తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు, ప్రతిపక్ష నాయకులే కాదు.. అధికార, ప్రతిపక్షంపై కోపం ఉన్న వారంతా కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అదే బాటలో బర్రెలక్క పయనిస్తోంది. బర్రెలక్క ఎవరూ అని మీకు అనుమానం రావొచ్చు. ఓ రెండేండ్ల కింద బర్రెలక్క వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎంత చదువుకున్నా.. ఎన్ని డిగ్రీలు చేసినా లాభం లేదు.. నోటిఫికేషన్‌లు ఇవ్వట్లేదంటూ.. బర్రెలను కాస్తూ ఆమె ఓ వీడియో చేసి ఇన్‌స్టాలో పోస్టు చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన కొందరు ఆమెను వేధింపులకు గురి చేశారు. ఇక ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం వచ్చిందని భావించిన.. శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల బరిలో దిగింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శిరీష బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. చాలా మందికి బర్రెలక్కకగా తెలుసు. నిరుద్యోగ అభ్యర్థుల తరపు నుంచి నేను ఇవాళ కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇల్లు ఇల్లు తిరిగి నేను ప్రచారం చేయలేకపోవచ్చు. డబ్బులు కూడా ఇవ్వలేకపోవచ్చు. కానీ మీరు ఏది న్యాయం, అన్యాయం తెలుసుకోని నన్ను గెలిపిస్తరని కోరుకుంటున్నా అని శీరిష తెలిపారు.
ఇన్‌స్టా రీల్స్ వీడియో సారాంశం ఇదే..
హాయ్ ఫ్రెండ్స్.. బర్లు కాయనికి వచ్చాను ఫ్రెండ్స్. ఎంత సదివిన గానీ డిగ్రీలు డిగ్రీలు మెమోలు వస్తయి తప్ప జాబ్‌లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ ఎయ్యడు.. ఏం ఎయ్యడు. అందుకే మా అమ్మను అడిగి గీ నాలుగు బర్లను కొన్న. రోజుకొక్క బర్రె పొద్దుగాళ్ల మూడులీటర్ల పాలు ఇస్తదంట. సాయంత్రం ఓ మూడు లీటర్లు.. మొత్తం ఆరు లీటర్లు. మూడు వందలు ఎక్కడపోవు ఫ్రెండ్స్. ఇగో ఇవి మా బర్లే.