Suryapet | పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న బాధితులు కిడ్నాప్ చేసి.. 30 లక్షలు కాజేశాడు: మమత దంపతులు, కూకట్ పల్లి డబ్బులు ఇవ్వకుంటే.. రైస్ మిల్లులో నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడు జానయ్యకు భయపడి విడతల వారీగా 30 లక్షలు ఇచ్చిన బాధితులు ఆధారాలతో సహా కూకట్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు జానయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు నరరూప రాక్షసుడు నయీమ్ ముఠాను మించి సూర్యాపేటకు చెందిన డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ […]
Suryapet |
నరరూప రాక్షసుడు నయీమ్ ముఠాను మించి సూర్యాపేటకు చెందిన డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోనే కాదు.. రాష్ట్రం నలుమూల నుండి ఆయన బాధితులు బయటకు వస్తున్నారు. ఇప్పటికే 80 మందికి బాధితులు వివిధ పోలీసు స్టేషన్లలో జానయ్య అక్రమాలపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూకట్ పల్లికి చెందిన దంపతులు తమను కిడ్నాప్ చేసి 30 లక్షలు కాజేశాడని ఆరోపిస్తూ జానయ్యతో పాటు ఆయన కుమారుడు గణేష్, అనుచరుడు వెంకట్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
తమను కిడ్నాప్ చేసి సూర్యాపేట సమీపంలోని వజ్ర రైస్ ఇండస్ట్రీలో నిర్భందించడం తో పాటు అసభ్యంగా ప్రవర్తించారని కూకట్ పల్లికి చెందిన మమత, ఆమె భర్త చక్రవర్తి ఫిర్యాదు చేశారు. తమకు సంబంధం లేని విషయంలో జానయ్య చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించారు. అతడి బెదిరింపులు, వేధింపులు తాళలేక విడతల వారీగా 30 లక్షలు చెల్లించామని వాపోయారు. వాటికి సంబంధించిన పక్కా ఆధారాలను సైతం పోలీసులకు అందజేశారు.. అయ్యప్ప మాలలో ఉండి కూడా జానయ్య అనుచరులు తాము ఉంటున్న బాలాజీ రెసిడెన్సీకి వచ్చి తమను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. కిడ్నాప్ చేసిన వీడియోలను సైతం బాధితురాలు మమత పోలీసులకు అందజేశారు.
మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన జానయ్య బాధితులు
నరరూప రాక్షసుడు వట్టే జానయ్య యాదవ్ బారినుండి తమను రక్షించాలంటూ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు బాధితులు. బెదిరింపులు, దౌర్జన్యాలతో తమ భూములను కబ్జా చేశాడని, ఎదురు మాట్లాడితే అనుచరులతో కలిసి దాడులు చేస్తున్నాడని కమిషన్ ముందు వారు వాపోయారు. దీంతో జానయ్య అక్రమాలపై కమిషన్ సీరియస్ అయింది. అక్రమాల నివేదికతో కమిషన్ ముందు హాజరు కావాలని కమిషనర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు.
మా భూమి పక్కనే వెంచర్ వేసి మా భూమిని కబ్జా చేశాడు : శ్రీనివాస్ సూర్యాపేట
రూపాయి రూపాయి కూడా పెట్టుకుని 2008లో గాంధీనగర్లో 487 సర్వే నంబర్లు ఎకరంన్నర భూమి కొనుక్కున్న. 10 సంవత్సరాలుగా వ్యవసాయం కూడా చేస్తున్నాం. మా భూమి పక్కన 2017లో వట్టే జానయ్య గండమల్ల వెంకన్న వెంచర్ వేసిండ్రు. తర్వాత మా భూమిని మెల్లమెల్లగా ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మా హద్దులు తొలగించి మా భూమిని ఆక్రమించారు. అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు. మా భూమిలో దౌర్జన్యంగా రోడ్లు కూడా వేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసాం. మాకు న్యాయం చేయాలి.
మమ్మల్ని చిత్రహింసలు పెట్టాడు: బుచ్చి రాములు
జానయ్య నన్ను చిత్రహింసలు పెట్టిండు. 337, 338, 339, 410, 411 సర్వే నంబర్లలో నా భూమి కబ్జా చేసిండు. నా ఆరు ఎకరాల భూమి అతని భూమిలో కలుపు కున్నాడు. 349 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు. నా భూమిలో అక్రమంగా ఫంక్షన్ హాల్ కట్టిండు. నయీమ్ కన్నా ఎక్కువ రాచకాలు చేస్తున్నాడు జానయ్య. అంతా గూండా ఇజం , రౌడీయిజం. ఎ
ప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అర్థమైత లేదు. నాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. నన్ను చాలా ఇబ్బందులు పెట్టిండు. నా భూమిని ఆక్రమించి నన్ను ఊర్లోకి రానివ్వలేదు. 2020 మార్చ్ లో నా భార్య పిల్లలు ఇంటికి పోతే వెంటపడి గడ్డపారలతో దర్వాజాలు పగలగొట్టి, నా భార్య పిల్లల మీద దాడి చేసిండు. ఇదేందని ప్రజలు అడిగితే ఇద్దరు ముగ్గురిని కొట్టిండు. రివాల్వర్ చూపెట్టి భయపెట్టిండు. మాకు న్యాయం కావాలి. మా భూమి మాకు దక్కాలి.
జానయ్య పై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయాలి: వల్లెం శేఖర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
జానయ్య అక్రమాలు దౌర్జన్యాలు మితిమీరి పోయాయి. 79 సర్వే నంబరులో నాకు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. 2009లో కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య నా పొలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాడు. మేము అడ్డుకున్నాం. మారణాయుధాలు, గన్నుతో బెదిరించి నా పైన, నా తమ్ముడి పైన జానయ్య తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. మా చేతులు విరగొట్టాడు.
మాతోపాటు ఉన్న ఓ వ్యక్తి తల పగలగొట్టాడు. మేము కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాం. అందుకు ప్రతీకారంగా మా పైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు జానయ్య వల్ల నేను 25 లక్షలు పైగా ఇంతవరకు నష్టపోయాను. కోర్టు ఆర్డర్ ను కూడా లెక్క చేయక మళ్ళీ మా పొలంలో జానయ్య దౌర్జన్యంగా రాళ్లు పాతి, మొక్కలు నాటించారు. బీసీ పేరు చెప్పి దౌర్జన్యం చేస్తున్నాడు. నాతో సహా 500 మందికి పైగా బాధితులు ఉన్నారు. అతనిపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయాలి. మా అందరికీ న్యాయం చేయాలి.
మా ప్లాట్ వ్యవహారం కోర్టులో ఉందని మోసం చేస్తున్నాడు : రహీమున్నీసా, తుంగతుర్తి
2006లో మేము 26 గజాల ప్లాట్ కొనుగోలు చేసాం. ఇల్లు కట్టుకోవాలని చూస్తే జానయ్య అడ్డొచ్చాడు. ఈ స్థలం కోర్టులో పెండింగ్ లో ఉందని బెదిరించాడు వేరే దగ్గర స్థలం ఇప్పిస్తానన్నాడు. ఇప్పించలేదు. 15 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఎస్పీకి కంప్లైంట్ చేశాను మాకు న్యాయం చేయాలి.
మా స్థలంలోకి రానివ్వడం లేదు: శ్రీనివాస్, ఖమ్మం
గాంధీ నగర్ లో 2005లో 888 గజాల ప్లాట్ కొన్నాం. అయితే మా స్థలం కోర్టులో పెండింగ్ ఉందని జానయ్య నన్ను, నా భార్యను బెదిరించాడు. స్థలంలోకి రానివ్వడం లేదు. మేము నాటిన రాళ్లు పీకేసాడు. తర్వాత మేము కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం. అయినా దౌర్జన్యం చేస్తున్నాడు. మాకు న్యాయం జరగడం లేదు. మా స్థలం మేము దక్కించుకోవడానికి పోలీసులకు ఫిర్యాదు చేసాం.
చంపుతామని బెదిరిస్తున్నాడు: పెండ్యం కృష్ణ, సూర్యాపేట
1982లో నా భార్య పేరిట పొలం కొన్నాను. 40 ఏళ్లుగా మా పేరుతో ఉన్న స్థలాన్ని సర్వే నెంబర్ తప్పు పడిందని జానయ్య దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. ఫోర్జరీ చేసి ఒక ఎకరం పట్టా అక్రమంగా చేయించుకున్నాడు. మేము నాటిన చెట్లను నరికేసి, భూమి ఆక్రమించుకున్నాడు. మాపై అనేక సార్లు దాడులు చేశాడు. ఈ గొడవల్లో జానయ్య పెట్టిన మానసిక వేదన భరించలేక నా భార్య చనిపోయింది. ఎస్పీ, కలెక్టర్, మంత్రికి చాలాసార్లు ఫిర్యాదు చేశాను. స్థలంలోకి వస్తే చంపుతానని జానయ్య బెదిరిస్తున్నాడు. నా స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని రెండు కోట్ల రూపాయలకు కొమ్ముకున్నాడు. మాకు న్యాయం చేయాలి.
చంపుతాడేమోనని భయంగా ఉంది: మమత, కూకట్ పల్లి
మాకు సంబంధం లేని విషయంలో జానయ్య నన్ను, నా భర్త చక్రవర్తిని చిత్రహింసలకు గురిచేశాడు. అతడి బెదిరింపులు, వేధింపులు తాళలేక విడతల వారీగా 30 లక్షలు చెల్లించాం. వాటికి సంబంధించిన పక్కా ఆధారాలను సైతం పోలీసులకు అందజేశాం. ఇన్నాళ్లు.. ఎదురు మాట్లాడితే చంపేస్తాడేమోనని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు జానయ్య బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అందుకే మేము కూడా ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలి.