Rythu Bharosa | ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల.. 70 లక్షల మంది రైతులకు లబ్ధి
ఈ నెల 22న రైతుభరోసా తొలి విడత కింద ఎకరంల వరకూ భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
Rythu Bharosa | తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. ఈ నెల 22న రైతుభరోసా తొలి విడత కింద ఎకరంల వరకూ భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయనున్నారు. ఇటీవలే మంత్రి వివేక్ వెంకటస్వామి.. ఈ మార్చి నెలలోనే రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమచేయనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి వివేక్ వెంకట స్వామి రైతు భరోసా కింద రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. మార్చి నెలలో తొలి విడతగా రూ.4,500కోట్ల వేస్తామని, మిగతా నిధులను ఏప్రిల్ లో విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వం రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రెండు ధఫాలుగా రూ.6వేల చొప్పున రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులతో ఆదివారం ముఖ్యమంత్రి చర్చించారు. తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా రైతు భరోసా నిధులు విడుదల పూర్తి చేస్తారు. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు చేరనున్నాయి.
వాస్తవానికి గత ఏడాది డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతు భరోసా… జనవరి మొదటి వారంలో ఇస్తామని ఒకసారి, సంక్రాంతికని మరోసారి.. మున్సిపల్ ఎన్నికల ముందు, తర్వాతా అని మరోసారి ప్రభుత్వం లీకులు ఇచ్చి.. వాయిదా మంత్రాన్నే పఠించింది. చివరకు మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిశాక రైతుల ఖాతాల్లో నిధులు వేస్తామంటూ ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిసిపోయినా…ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధుల విడుదల జరుగపోవడంతో రైతాంగంలో అసహనం తీవ్రమైంది. గత వానకాలం సీజన్ లో 69,39,548 రైతులకు ఒక ఎకరాకు ₹6,000 చొప్పున బదిలీ చేశారు. మొత్తం ₹8,744.13 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సుమారు 1 కోటి 45 లక్షల 73వేల ఎకరాల కు సాయం అందింది. పంటల సాగు విస్తీర్ణం సర్వే లెక్కలపై జాప్యం నెలకొనడంతో ఈ యాసంగి లో కూడా అంతే మొత్తం బదిలీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. అయితే రైతు భరోసా నిధుల పంపిణీపై ప్రభుత్వం వాయిదా పర్వాన్ని కొనసాగిస్తుండటం రైతాంగం సహనానికి పరీక్ష పెట్టింది. దీనిపై రాజకీయంగా తీవ్ర విమర్శలే వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడాదికి మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. నేడు ఏడాదికి కనీసం ఒక పంటకు కూడా రైతు బంధు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram