సైనిక్ స్కూల్ తరలింపుపై కడియం..కోమటిరెడ్డిల వాగ్వివాదం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, బీఆరెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మధ్య మరోసారి వాగ్వివాదం చోటుచేసుకుంది

సైనిక్ స్కూల్ తరలింపుపై కడియం..కోమటిరెడ్డిల వాగ్వివాదం

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, బీఆరెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మధ్య మరోసారి వాగ్వివాదం చోటుచేసుకుంది. శుక్రవారం అసెంబ్లీలో కడియం శ్రీహరి మాట్లాడుతూ తన నియోజకవర్గం స్టేషన్ ఘన్ పూర్ నుంచి సైనిక్ స్కూల్ ను తరలించవద్దని, అలాగే రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలించవద్దని ప్రభుత్వాన్ని కోరారు.


కడియం ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 2017 లో మంజూరైన సైనిక్ స్కూల్‌ను మొన్నటి వరకు 9 మంది లోక్ సభ సభ్యులు, అరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని అలాగే బీజేపీ ప్రభుత్వంతో వారికి ఫ్రెండ్షిప్ ఉండేదని అప్పుడు ఎందుకు పూర్తి చేయించుకోలేదని ప్రశ్నించారు. అయినా తాము సైనిక్ స్కూల్ తరలిపోకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్ర చిహ్నం మార్పులపై త్వరలో నిపుణుల కమిటీ వేసి చిహ్నం ఎలా ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు.


కడియం శ్రీహరి మాట్లాడుతూ బీఆరెస్‌ ప్రభుత్వంలో చేపట్టిన నియామకాలకు ఇప్పుడు పత్రాలు అందిస్తూ.. ఆ నియామకాలను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకోవడం విడ్డూరమన్నారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసిన ఉద్యోగ నియామకాలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. తాము గానీ, తమ సీఎం గానీ ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చెప్పలేదని, భర్తీ చేసి ఉద్యోగ నియామకాల పట్ల మా చిత్తశుద్ధిని చాటామన్నారు.