కృష్ణా గోదావరి బేసిన్‌లో ప్రారంభమైన చమురు ఉత్పత్తి..
కృష్ణ - గోదావరి బేసిన్ (KG Basin) లో గ్యాస్, చమురు తవ్వకాలు ప్రారంభించినట్లు పెట్రెలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సోమవారం వెల్లడించారు

కృష్ణ – గోదావరి బేసిన్ (KG Basin) లో గ్యాస్, చమురు తవ్వకాలు ప్రారంభించినట్లు పెట్రెలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సోమవారం వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఆదివారం నుంచి చమురును వెలికితీస్తోందని తెలిపారు. దీనిని డీప్ వాటర్ ప్రాజెక్టుగా పేర్కొన్న ఆయన.. ఇక్కడ ఆపరేషన్ చాలా క్లిష్టతరమైనది అభివర్ణించారు. కృష్ణా-గోదావరిలో బయటపడిన ఈ నిధి ద్వారా దేశం పెట్రో, గ్యాస్ రంగంలో ఆత్మనిర్బరతను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా.. ఆయన తెలిపిన ప్రకారం.. కాకినాడలో సముద్ర తీరానికి 30 కి.మీ.దూరంలో తొలి రోజు మొదటి
సారి చమురును బయటకు తీశారు. మే, జూన్ నాటికి ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ వెళ్లి రోజుకు 45,000 బ్యారెళ్ల చమురు, 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను తోడనున్నారు. ఇది మన దేశ చమురు ఉత్పత్తిలో 7 శాతంగానూ.. గ్యాస్ ఉత్పత్తిలో 7 శాతంగానూ ఉండనుంది. 2016-17లో బావుల నిర్మాణం ఊపందుకోగా కొవిడ్ వల్ల రెండేళ్ల పాటు ఎటువంటి పనులూ జరగలేదు. మొత్తం 26 బావుల నుంచి ఉత్పత్తి చేయనుండగా.. ప్రస్తుతం నాలుగు బావుల నుంచి చమురు వెలికితీత జరుగుతోంది. ఈ మేరకు కేంద్రమంత్రి పురి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.