Manukota
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి సమీపంలో బుధవారం స్కూల్ బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం జరుగలేదు. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన శ్రీ నలంద పాఠశాల స్కూల్ బస్సు దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో విద్యార్థులను తీసుకు రావడానికి వెళుతుండగా మండలం కేంద్ర శివారులోని మూలం మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
డ్రైవర్ అతివేగం వల్ల బోల్తా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 30మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్కూల్ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
వరుస సంఘటనలు
ఇదిలా ఉండగా ఇటీవల నెల్లికుదురు సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఫల్టీ కొట్టింది. వర్షాలకు తోడు బస్సు కండీషన్ సక్రమంగా లేకపోవడంతో పాటు డ్రైవర్ల అతివేగం కారణంగా చెబుతున్నారు. పాఠశాల యజమానుల అలసత్వం అసలుకారమని విమర్శలున్నాయి.