రెండ్రోజుల్లో డీఎస్సీ

DSC | కార్పొరేట్‌ స్థాయిలో సర్కారీ బడులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన ఆరేళ్ల తర్వాత వస్తున్న నోటిఫికేషన్‌ పాఠశాల విద్యలో 5,089 పోస్టులు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 6,500కు పైగా పోస్టుల భర్తీకి చాన్స్‌ నిరీక్షణలో నాలుగు లక్షల మంది విధాత, హైదరాబాద్‌: ఆరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి […]

రెండ్రోజుల్లో డీఎస్సీ

DSC |

  • కార్పొరేట్‌ స్థాయిలో సర్కారీ బడులు
  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన
  • ఆరేళ్ల తర్వాత వస్తున్న నోటిఫికేషన్‌
  • పాఠశాల విద్యలో 5,089 పోస్టులు
  • స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523
  • 6,500కు పైగా పోస్టుల భర్తీకి చాన్స్‌
  • నిరీక్షణలో నాలుగు లక్షల మంది

విధాత, హైదరాబాద్‌: ఆరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. మొత్తం 6,500 కు పైగా పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 పోస్టులున్నాయి. ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్ల మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలలను కార్పొరేట్‌ పాఠాశాలల స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

ఆరేళ్ల నుంచి కొత్త పోస్టుల భర్తీ లేదు

రాష్ట్రావిర్భావం తర్వాత 2017లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీఎస్సీని టీఆర్‌టీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌)గా మార్చి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియామకాలు చేపట్టింది. అపట్లో దాదాపు 25 వేల పోస్టులు ఖాళీ ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. అందులోనూ 8,792 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నియామక ప్రక్రియ పూర్తై ఆరేళ్లు అవుతున్నా.. కొత్తగా భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. గత మార్చిలో తెలంగాణ రాష్ట్రంలో 1 నుంచి 8 వ తరగతి వరకు బోధించే టీచర్ పోస్టులు 11,348 ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి తెలిపారు.

నాలుగు లక్షల మంది నిరీక్షణ

రాష్ట్రంలో 80 వేల పోస్టులకు పైగా భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఏడాది మార్చి 9న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అప్పుడు పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇందులో భాగంగా సెకండరీ ఎడ్యుకేషన్‌లో ఖాళీగా ఉన్న 13,086 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఏడాది దాటినా ఆ హామీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో సుమారు 24 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటి కోసం నాలుగు లక్షల మంది ఎదురుచూస్తున్నారు.

ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి ప్రభుత్వ ప్రకటనల్లో చెప్పిన పోస్టులకు నోటిఫికేషన్లలో జారీ అవుతున్న పోస్టులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 6 నెలలకు ఒకసారి టెట్‌, రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా శాఖకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. గురుకులాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఏటా ఖాళీ అవుతున్న టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై అలసత్వాన్ని ప్రదర్శించిందన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా విద్యాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో రాష్ట్రాల వారీగా చూస్తే అట్టడుగుస్థాయిలో ఉన్నది.

ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, ఐదేళ్లుగా బదిలీల లేవు

రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, ఐదేళ్లుగా బదిలీల కోసం గురించి ఎదురు చూస్తున్నారు. ఇవి గత ఏడాది వేసవి సెలవుల్లో పూర్తి చేస్తామని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలకు సీఎం హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌లు, ఎస్జీటీలు బదిలీలు, పదోన్నతులపై ఈ ఏడాది జనవరిలో విద్యాశాఖ జీవో జారీ చేసింది. బదిలీలపై స్పౌజ్‌ టీచర్స్‌, గుర్తింపు పొందిన సంఘ నాయకులకు అదనపు పాయింట్లు కేటాయించడంపై కొందరు ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారు.

దీంతో బదిలీలకు హైకోర్టు ఫిబ్రవరిలో బ్రేక్‌ వేసింది. మార్చి 14 వరకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నిలిపివేస్తున్నామని కోర్టు స్టే విధించింది. ప్రమోషన్లకు, బదిలీలకు అంతర్గత సంబంధం ఉన్నది. ముందుగా పీజీ హెచ్‌ఎంల బదిలీలు జరగాలి. తర్వాత పీజీ హెచ్‌ఎంల పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. తర్వాత స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ జరగాలి. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంల బదిలీల జరగాలి. తదుపరి స్కూల్‌ అసిస్టెంట్ ఖాళీలకు పదోన్నతులు నిర్వహించాలి.

చివరగా ఎస్‌జీటీ, పండిట్లకు ట్రాన్స్‌ఫర్లు జరగాలి. ఈ మొత్తం ప్రక్రియ జరగాలంటే ముందుగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరగాలి. బదిలీల ప్రక్రియ కోర్టు స్టే ఇవ్వడంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నది. దీనిపై వాదనలు జరుగుతున్నాయి. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయితే మరిన్ని ఖాళీలు ఏర్పడుతాయి. కానీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపడం లేదని, అందుకే పోస్టులు తక్కువగా ఉంటున్నాయని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.