కాంగ్రెస్‌లోనే ఔరంగ జేబులు: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీలోనే ఔరంగజేబులు ఉన్నారని, మీరంటే వారికి పొసగడం లేదని, కాంగ్రెస్‌ ఏక్ నాథ్ షిండే అయ్యేదే మీరంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

  • Publish Date - February 16, 2024 / 06:59 AM IST

విధాత, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీలోనే ఔరంగజేబులు ఉన్నారని, మీరంటే వారికి పొసగడం లేదని, కాంగ్రెస్‌ ఏక్ నాథ్ షిండే అయ్యేదే మీరంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంటనే.. ఆరు నెలలలోపు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళేది ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా ఉండాలని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.


హరీశ్‌‌రావుకు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాల్సిందే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావుపై సీఎం నోటికి వచ్చినట్లు మాట్లాడారని, సంచలనం కోసం సీఎం తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను, ఇచ్చిన ఉద్యోగాలను కూడా రేవంత్‌రెడ్డి చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అందజేసిన నియామక పత్రాలు కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలవేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రకటించిన నోటిఫికేషన్లు కాకుండా అదనంగా రెండు లక్షల ఉద్యోగాలు నింపాలని డిమాండ్ చేశారు.

Latest News