గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత
గిరిజనుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పనిచేస్తుందని, ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో ఎదగాలని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు

- సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కుంభం
విధాత: గిరిజనుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పనిచేస్తుందని, ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో ఎదగాలని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. గురువారం భువనగిరి రావి భద్రారెడ్డి ఫంక్షన్ హాలులో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ వారి 285 జయంతి వేడుకలలో,భోగ్ భండారు పూజకార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బంజారా కుటుంబాలలో వెలుగు నింపిన సేవాలాల్ చిరస్మరణీయులని, అహింసామార్గంలో ఆయన గడిపిన జీవిత విధానం అందరికి ఆదర్శమన్నారు.

సేవాలాల్ మహరాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా వారి ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. గిరిజనులలో కష్టపడేతత్వం ఉంటుందని, శ్రమనే నమ్ముకొంటారని, ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలను గిరిజన సోదరులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యాపరంగా గిరిజనులు మరింత ఎదగాల్సిన అవసరముందన్నారు. జిల్లాకు చెందిన కేతావత్ సోమలాల్‌కు పద్మశ్రీ రావడం జిల్లాకే గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్ర, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారి ఎం.ఎ.కృష్ణణ్, ఎంపీపీ నరాల నిర్మల, ఎంపీపీ నూతి రమేశ్, జిల్లా సేవాలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బానోతు రాములునాయక్, ఉపాధ్యక్షులు ధరావత్ సతీష్ నాయక్, ప్రధాన కార్యదర్శి బానోతు గోపీ నాయక్, కోశాధికారి రాజేంద్ర నాయక్, కార్యవర్గ సభ్యులు, గిరిజన ప్రతినిధులు, గిరిజనులు, ప్రజలు పాల్గొన్నారు.