Munugode | మునుగోడు బంధం ముగిసినట్లేనా? సీట్లు ఖాళీ లేవంటున్న బీఆరెస్‌ నేతలు

Munugode | వాళ్లే మద్దతు కోరారంటున్న కామ్రేడ్లు విధాత: బీఆరెస్‌, కమ్యూనిస్టుల మధ్య మునుగోడు ఉప ఎన్నికతో కుదిరిన మిత్ర బంధం ముగిసినట్లేనా? తమ పార్టీలోనే బలమైన అభ్యర్థులు చాలామంది ఉన్నారని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, తమ ప్రతిపాదనలకు ఇప్పటి వరకూ బీఆరెస్‌ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తొలి జాబితా తర్వాతే స్పందిస్తామని కామ్రేడ్లు చెబుతున్న మాటలు గమనిస్తే.. పొత్తు పొడిచే అవకాశాలు సన్నగిల్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మాకు బలమైన అభ్యర్థులున్నారు:జగదీశ్‌రెడ్డి రాష్ట్రంలో బీఆరెస్ […]

  • By: krs    latest    Aug 19, 2023 3:29 PM IST
Munugode | మునుగోడు బంధం ముగిసినట్లేనా? సీట్లు ఖాళీ లేవంటున్న బీఆరెస్‌ నేతలు

Munugode |

వాళ్లే మద్దతు కోరారంటున్న కామ్రేడ్లు

విధాత: బీఆరెస్‌, కమ్యూనిస్టుల మధ్య మునుగోడు ఉప ఎన్నికతో కుదిరిన మిత్ర బంధం ముగిసినట్లేనా? తమ పార్టీలోనే బలమైన అభ్యర్థులు చాలామంది ఉన్నారని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, తమ ప్రతిపాదనలకు ఇప్పటి వరకూ బీఆరెస్‌ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తొలి జాబితా తర్వాతే స్పందిస్తామని కామ్రేడ్లు చెబుతున్న మాటలు గమనిస్తే.. పొత్తు పొడిచే అవకాశాలు సన్నగిల్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

మాకు బలమైన అభ్యర్థులున్నారు:జగదీశ్‌రెడ్డి

రాష్ట్రంలో బీఆరెస్ పార్టీ ఓటు బ్యాంకు వరుసగా రెండు పర్యాయాల తర్వాత కూడా 38% నుండి 40శాతం పైగానే ఉనదని, ఉందని, కమ్యూనిస్టులు అడుగుతున్న సీట్లలో కూడా తమ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల కంటే బలంగా ఉందని, అలాంటప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు ఎందుకన్న వాదన బీఆరెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.

మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలి అంతిమంగా బీఆరెస్ విజయానికే దోహదం చేస్తుందని, పొత్తుతో కంటే ఆ పార్టీలకు దూరంగా ఉంటేనే ఎన్నికల స్ట్రాటజీలో బీఆరెస్‌కు సానుకూల ఫలితాలతో పాటు తమ మరిన్ని సీట్లు తమకే దక్కుతాయన్న వాదన గులాబీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

దీనిని బలపరిచేలా శనివారం సూర్యాపేటలో మాట్లాడిన మంత్రి జగదీశ్‌రెడ్డి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, తమకు అన్ని నియోజకవర్గాల్లో సీటింగ్ ఎమ్మెల్యేలతో పాటు బలమైన ఆశావహులైన అభ్యర్థులున్నారంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివురావు సైతం బీఆరెస్‌తో కమ్యూనిస్టుల పొత్తు ప్రతిష్టంభనపై స్పందించారు.

బీఆరెస్‌ను నాలుగు సీట్లు అడిగామని, వాళ్లు సానుకూలంగా స్పందించలేదని చెబుతున్నారు. పొత్తులపై బంతి బీఆరెస్ కోర్టులోనే ఉందన్నారు. బీఆరెస్ తొలి లిస్టు చూశాకే పొత్తుపై స్పందిస్తామన్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్‌, ఎన్‌టీఆర్‌లు కమ్యూనిస్టులను గౌరవించేవారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు కోసం బీఆరెస్ వాళ్లే తమకు వద్దకు వచ్చారని, మేమే వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పలేదని గుర్తు చేశారు.

ప్రస్తుతం బీఆరెస్‌, కమ్యూనిస్టు పార్టీల నేతల మాటలు చూస్తే ఇరు పార్టీల మధ్య పొత్తు అనుమానంగానే కనిపిస్తుంది. అయితే అనూహ్య నిర్ణయాలు తీసుకునే సీఎం కేసీఆర్ పొత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ నెల 21న ప్రకటించనున్న బీఆరెస్ తొలి జాబితాతో తేలిపోనుంది.

తెగని బేరసారాలు

చెరో నాలుగు సీట్లు కావాలని సీపీఐ, సీపీఎం గతంలో బీఆరెస్‌కు ప్రతిపాదన చేశాయి. బీఆరెస్ నుంచి మాత్రం చెరొక్క అసెంబ్లీ స్థానం, ఒక్కో ఎమ్మెల్సీ ఇస్తామన్న ప్రతిపాదన అందగా, దానికి కామ్రేడ్లు అంగీకరించలేదు. తదుపరి చెరో రెండు అసెంబ్లీ స్థానాలిస్తామంటూ బీఆరెస్ ప్రతిపాదన చేసింది.

ఈ మేరకు తొలి జాబితాల్లో చెరో రెండు స్థానాలు వదిలి అభ్యర్థులను ప్రకటిస్తారన్న లీకేజీలు ఇచ్చింది. అయితే ఆ ప్రతిపాదన కమ్యూనిస్టు నేతలకు అధికారికంగా అందలేదని సమాచారం. దీంతో పొత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది.

సీపీఐ కొత్తగూడెం, హుస్నాబాద్‌, వైరా, మునుగోడు స్థానాలను కోరింది. సీపీఎం భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం స్థానాలు కోరుకుంది. ఇప్పటికే ఆ నియోజకర్గాల్లో ప్రజాచైతన్య యాత్రలు సైతం ఆ పార్టీలు నిర్వహించి ఈ సీట్లపై తమ ఎర్ర కర్చీఫ్‌లు వేసి తమ ఉద్దేశాన్ని బీఆరెస్‌కు చాటి చెప్పాయి.

అయితే కమ్యూనిస్టులు కోరుతున్న ఆయా స్థానాల్లో బీఆరెస్ సీటింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తమ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని మళ్లీ తామే పోటీ చేస్తామంటూ బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పష్టం చేశారు. సి

టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా ఆ నియోజకవర్గాల్లో బీఆరెస్ నుంచే మరో ఇద్దరు ముగ్గురు బలమైన ఆశావహులు సైతం బీఆరెస్ టికెట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు కోరుతున్న నియోజకవర్గాల్లో బీఆరెస్ బలంగా ఉన్నందున పొత్తుతో వారికి ఆ సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న వాదన బీఆరెస్‌లో తలెత్తింది.