Maharashtra | చనిపోయాడనుకొని ఖననం చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే వాట్సాప్ వీడియో కాల్‌లో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మరి చనిపోయిన వ్యక్తి ఎవరు? అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాకు చెందిన ఓ 60 ఏండ్ల వ్యక్తి ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే రెండు నెలల క్రితం ఆ ఆటో డ్రైవర్ అదృశ్యమయ్యాడు. భర్త అదృశ్యం కావడంతో బతుకుదెరువు కోసం భార్య పుణె వెళ్లింది.
అయితే జనవరి 29వ తేదీన బోయిసర్ – పాల్‌ఘర్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి తమ సోదరుడు రఫీక్ షేక్ అని ఓ వ్యక్తి రైల్వే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేరళలో ఉంటున్న షేక్ భార్యకు పోలీసులు సమాచారం అందించారు. ఆమె పాల్‌ఘర్ చేరుకుని చనిపోయిన వ్యక్తి తన భర్తే అని పేర్కొంది. ఈ క్రమంలో మృతదేహాన్ని ఖననం చేశారు.
సీన్ కట్ చేస్తే.. ఈ తతంగం జరిగిన రెండు రోజులకే షేక్ తన స్నేహితుడికి వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. తాను క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో షేక్ స్నేహితుడు అతని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు. షేక్ బతికి ఉన్న విషయం రైల్వే పోలీసులకు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మరి చనిపోయిన వ్యక్తి ఎవరు? అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు గుర్తించి, వారికి సమాచారం అందిస్తామని పోలీసులు పేర్కొన్నారు.