విధాత: పంజాబ్ మొహాలీలోని ఓ ప్రయివేటు యూనివర్సిటీకి చెందిన అమ్మాయిల ప్రయివేటు వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. దీంతో బాధిత అమ్మాయిలు యూనివర్సిటీ ముందు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. అమ్మాయిలు క్యాంపస్ ఆవరణలోని బాత్రూంలో స్నానాలు చేస్తుండగా వీడియోలను చిత్రీకరించారు. అయితే ఆ వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో.. బాధిత విద్యార్థినులు షాక్‌కు గురయ్యారు.
తమ ప్రయివేటు వీడియోలను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రయివేటు వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంపై ఓ విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు.
అయితే అదే క్యాంపస్‌కు చెందిన ఓ యువతి.. తన ఫ్రెండ్స్ స్నానాలు చేస్తుండగా, వారికి తెలియకుండా వీడియోలను చిత్రీకరించింది. అనంతరం వాటిని హిమాచల్ ప్రదేశ్‌లోని తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపించింది. అతను ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీడియోలను చిత్రీకరించిన అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై పంజాబ్ స్టేట్ వుమెన్ కమిషన్ చైర్‌పర్సన్ మనీషా గులాటి తీవ్రంగా స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, వీడియోలను చిత్రీకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఎవరూ భయపడొద్దని, బాధిత అమ్మాయిలకు అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.